
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ బిల్లులపై హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని, బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆస్పత్రులను కాంగ్రెస్ పూర్తి చేయట్లేదు అని విమర్శించారు. సిఎంఆర్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని, ఈ అంశాల గురించి చర్చించడానికి సభలో తమకు మైకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మేజర్ సర్జరీలకు కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం చేయట్లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక చిన్న ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఎప్పటిలోగా ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తారో ప్రభుత్వం చెప్పాలని.. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్ లో పెట్టి విడుదల చెయ్యాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.