Reading Time: < 1 minute
Inter Admissions 2026: ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. ఏప్రిల్ 1 నుంచే దరఖాస్తులు ప్రారంభం

అమరావతి, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ల జనరల్, వొకేషనల్ స్ట్రీమ్‌లలోని రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సులకు ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ విద్యా మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించాలని సూచించింది. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి జూన్‌1వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహించాలని షెడ్యూల్‌లో పేర్కొంది. ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీగా జూన్ 1ని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇక జూన్‌ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, సహకార, రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మోడల్ జూనియర్ కళాశాలలతో పాటు ఇంటర్మీడియట్ కోర్సులను అందించే కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో అన్ని కేటగిరీలు, కోటాలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. ఖచ్చితమైన రికార్డులను నిర్వహించడానికి, ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలను నిర్దేశిత కాలపరిమితిలోగా UDISE ప్లస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరినీ ఆదేశించారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిలో ప్రవేశ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ఏకరూపతను నిర్ధారించడం కోసం షెడ్యూల్‌ను తప్పనిసరిగా అనుసరించాలని బోర్డు తెలిపింది. చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్దేశించిన తేదీలలోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.