Reading Time: < 1 minute

పోలీసులు దాఖలు చేసిన కేసు కోర్టులో విచారణకు రాగా వృద్ధురాలి అణువోజు రాజేశ్వరికి (70) పక్షవాతం రావడంతో ఆమెను శుక్రవారం అంబులెన్స్‌లో కోర్టుకు తీసుకొని రాగా ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ భానోత్ రాజేశ్వర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సమక్షంలో అంబులెన్సులో స్వీకరించటం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. ఈ కేసు వివరాలు లోకి వెళితే చిగురు మామిడికి చెందిన అను వోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావటంతోపాటు ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిదైంది. ఉద్యోగి అయిన కొడుకు అణువోజు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె ఆర్డిఓ వద్ద కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు విచారించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు నెలకు 4 వేల రూపాయలు పోషణ నిమిత్తం తల్లికి చెల్లించాలని తీర్పునిచ్చారు.

కొడుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె చిగురుమామిడి పోలీసులకు కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కొడుకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా ఫిర్యాదుదారు రాజేశ్వరి సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. పక్షవాతం వచ్చి ఆమె రాలేని పరిస్థితిలో ఉండగా అంబులెన్స్‌లో ఆమెను కోర్టుకు తీసుకొని వచ్చారు. అంబులెన్స్‌లో ఉన్న ఆమె వద్దకు మెజిస్ట్రేట్ వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని ప్రాసి క్యూటరు వీరస్వామి, న్యాయవాది వేణుగోపాల్ సమక్షంలో అంబులెన్స్ లోనే రికార్డ్ చేశారు. ఫిర్యాది రాజేశ్వరి కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్షం చెప్పడం గమనార్హం.