
తూర్పుగోదావరి: అంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ప్రజలకు భయభాంతులకు గురి చేస్తున్న పెద్దపులిని అటవీ శాఖ అధికారులు బంధించారు. కూర్మాపురంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. పులిని పట్టుకోవడానికి పూణెకు చెందిన ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి పులిని పట్టుకున్నారు.
కాగా, గత వారం రోజులుగా ఎక్కడ చూసిన పులి జాడ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోజుకో, పూటకో రూటు మారుస్తూ.. అటవీ శాఖ అధికారులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టింది. ఆరు రోజుల కిందట సీతా నగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి చంపిన పులి రఘునాథపురంలో ఓ గేదెను చంపింది. అనంతరం మర్రపాలెంలో మూడు లేగదూడలను బలిగొంది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు నేషనల్ ఎక్స్‌పర్ట్ టీమ్‌ను తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పులిని బంధించేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం రాయవరం మండలంలోకి ప్రవేశించిన పులి జి.ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. తాజాగా అక్కడే రెస్క్యూ బృందాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించారు. దీంతో ప్రజలు అంతా ఊపిరి పీల్చుకున్నారు.