Reading Time: < 1 minute

ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆయనను గల్లా పట్టి అడగాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డి.ఎలు, పిఆర్‌సి లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని,

మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి కోవర్టు ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల తీర్పే కెసిఆర్‌కి ఇచ్చే అసలైన గౌరవం అని, పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఒక ధ్రువతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలం అని, రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని కెటిఆర్ పిలుపునిచ్చారు.