
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌లోని షియాలకు చెందిన ఓ ప్రార్థన మందిరం దగ్గర భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 160 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇస్లామాబాద్‌లోని షెహబాద్ ప్రాంతంలోని ప్రార్థనా మందిరంలో సూసైడ్ బాంబర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ.. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న ఓ విదేశీ పౌరుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియేయెవ్ పాకిస్థాన్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత సంచలనంగా మారింది.