
చత్తీస్‌ఘడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి పి.సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని దక్షిణ అటవీ ప్రాంతంలో బస్తర్ డివిజన్‌కు చెందిన డివిసిఎం ఉదమ్ సింగ్‌తో సహా సాయుధులైన మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం మేరకు డిఆర్‌జి బలగాలు, కోబ్రా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాల పైకి కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని, కాల్పుల అనంతరం ఎన్ కౌంటర్ స్థలాన్ని పరిశీలించగా డివిసిఎం ఉదమ్ సింగ్ మృతదేహం లభ్యమైనట్లు, మృతదేహంతోపాటు ఆటోమేటిక్ ఆయుధం, ఏకే 47, పలు పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు చెందిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఉదం సింగ్ సౌత్ బస్టర్ డివిజన్ ప్లాటు నెంబర్ 30 కి ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్నట్లు, ఇతనిపై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.
ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఉదం సింగ్ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడా నివాసి అని, 2002 2003లో మావోయిస్టు పార్టీలో చేరి సభ్యుడిగా వివిధ హింసాత్మక సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో చురుగ్గా పనిచేస్తున్నట్లు, గత మూడు సంవత్సరాలుగా పామేడు ఏరియా కమిటీల్లో పనిచేస్తూ పలు సంఘటనలో పాల్గొన్నాడని అన్నారు. ఇతనిపై బీజాపూర్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో 9 క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు.2023 వ సంవత్సరం తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండం అడవుల్లో పోలీసు బృందం పై దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, 2024 సంవత్సరంలో జడ్పల్లి పోలీస్ క్యాంపుపై దాడి ఘటనలో పాల్గొన్నాడని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్, సిఆర్పిఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ బిఎస్ నేగి, ఇతర అధికారులు పాల్గొన్నారు.