
కరాచీ : టి 20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించడాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమర్థించారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తమ క్రికెట్ టీం ఈ నిర్ణయం తీసుకుందని , ఇది సముచిత నిర్ణయం అని షరీఫ్ ఇక్కడ ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం తరువాత తెలిపారు. ఈ నెల 15వ తేదీన కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ ఆటనుంచి వైదొలగాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు షరీఫ్ ప్రభుత్వం తెలిపింది.
క్రీడల్లో రాజకీయాలకు తావు ఉండరాదని, ఇండియాతో గేమ్ ఆడకూడదని నిర్ణయించుకున్నామని చెప్పిన షరీఫ్ తాము బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉంటామని తేల్చిచెప్పారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం పట్ల ఐసిసి మండిపడింది. అత్యంత కీలకమైన మ్యాచ్. స్పాన్సర్స్‌కు , ప్రకటనకర్తలకు, ప్రసారకర్తలకు డబ్బులు తెచ్చిపెట్టే ఈ మ్యాచ్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు పునరాలోచించాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పిసిబి సరియైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.