Reading Time: < 1 minute

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యా హక్కు చట్టం 2010 లోని సెక్షన్ 23 సవరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ టియస్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ..

ఉపాధ్యాయుల గౌరవాన్ని అన్యాయంగా తగ్గించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం టెట్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. టెట్ అర్హత దేశంలో సుమారు 25 లక్షల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిందని అన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నాకు ఆల్ ఇండియా జాక్‌తో స్టీరింగ్ కమిటీ సభ్యులు సిఎన్ భార్తి, చావ రవి, కత్తి నరసింహారెడ్డి, సదానంద గౌడ్‌లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ ధర్నా శిబిరానికి కేరళ రాష్ట్రానికి చెందినపార్లమెంట్ సభ్యులు జాన్ బ్రిటీష్, శివ దాసన్, తమిళనాడు నుండి సెల్వరాజ్, కర్ణాటక నుండి కుమార్‌నాయక్, బీహర్ నుండి రాజారామ్ సింగ్, సిపిఐ నాయకులు నారాయణ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. వెంకట్, ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు అమియకుమార్, వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.