
న్యూఢిల్లీ : భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మార్చి నెల మధ్యలో కుదురుతుంది. అప్పటికీ సంతకాలు జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర దిగుమతులు, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ గురువారం చెప్పారు. చాలా కాలంగా ఇరుదేశాల మధ్య ఈ డీల్ పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు సాకారం కానుందని మంత్రి తెలిపారు. డీల్ కుదిరితే భారతీయ దిగుమతులపై సుంకాలు తగ్గుతాయి. పరస్పరం సుంకాల తగ్గింపు ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఇటీవలే ప్రెసిడెంట్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు, డీల్ కుదర్చుకుంటున్నట్లు తెలిపారు.
ఒప్పందం మార్చిలో కుదురుతుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సంయుక్త ప్రకటన వచ్చే నాలుగు అయిదురోజుల్లో వెలువడుతుందని మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత అమెరికా సుంకాలు 18 శాతం మేర తగ్గుతాయి. ప్రస్తుతం భారతీయ సరుకులపై అమెరికాలో 50 శాతం దిగుమతి సుంకాలు ఉన్నాయి. అది కాకుండా రష్యా చమురు కొనుగోలుకు మండిపాటుగా ట్రంప్ 25 శాతం పన్నులు విధించారు.
ఈ ప్రతీకార సుంకాలలో ఇప్పుడు తగ్గుదల ఉంటుంది. మొత్తం డీల్ కుదిరిన తరువాత అప్పటి పరిస్థితులను బట్టి అమెరికా టారీఫ్ ఏ విధంగా ఉంటుందనేది వెల్లడవుతుంది. ఇరుదేశాల మధ్య కీలక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) తొలి దఫా సంయుక్త ప్రకటన ఇక వెలువడటమే తరువాయి అని మంత్రి చెప్పారు. ఇక చట్టపరమైన ఒప్పందం తరువాతనే అమెరికా సరుకులపై భారతదేశ టారీఫ్‌ల తగ్గింపు అమలులోకి వస్తుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు.