Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకే దిగుతుంది. మొత్తం 294 స్థానాలకు అభ్యర్థులను దింపుతుంది. పశ్చిమ బెంగాల్ పిసిసి కీలక నేతలతో సంప్రదింపుల సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, బెంగాల్‌కు పార్టీ ఇన్‌చార్జీ గులాం అహ్మద్ మీర్, బెంగాల్ పిసిసి అధ్యక్షులు శుభాకంర్ సర్కార్ , ఎంపి ఇషా ఖాన్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. తరువాత మీర్ విలేకరులతో మాట్లాడారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. మమత బెనర్జీ నాయకత్వపు టిఎంసి అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తోంది. కంచుకోటగా తమకు ఇంతకాలం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వామపక్షాలు తమ జెండా ఎగురవేసుకునే దిశలో కలిసికట్టుగా ప్రయత్నించలేకపోతున్నాయి. ఈ దిశలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఒంటరి పోరు నిర్ణయం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భవితవ్యంపై ఏ విధంగా ఉంటందనేది కీలక ప్రశ్న కానుంది.

రాష్ట్రంలో పార్టీ కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్లి దెబ్బతిందని, తిరిగి ఈ ప్రయోగం చేయదల్చుకోలేదని మీర్ వెల్లడించారు. ఒంటరి పోరు నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు 294 స్థానాల్లో పోటీకి సన్నాహాలకు దిగుతామని వెల్లడించారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రంట్‌తో ఎన్నికలకు జట్టు కట్టింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ ఒక్క సీటూ కాంగ్రెస్‌కు రాలేదు. ఇది షాక్ నిచ్చింది.