Reading Time: < 1 minute

సోకోటో ః నైజీరియాలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమానికి దిగారు. రెండు గ్రామాలపై విరుచుకుపడ్డారు. వీరి అరాచక దాడిలో మొత్తం 162 మంది వరకూ చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గ్రామాలలో శ్మశాన వాతావరణం నెలకొంది. పశ్చిమ నైజిరియాలోని క్వారా రాష్ట్రంలో వోరో, నూకూ గ్రామాలను ఎంచుకుని తీవ్రవాదులు స్వైర విహారానికి దిగారు. లకూరవా మిలిటెంట్ల సంస్థ దాడికి దిగిందని.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఈ దారుణానికి దిగిందని ఈ ప్రాంత ఎంపి మెహమ్మద్ ఒమర్ బియో తెలిపారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటికైతే ఏ సంస్థ ప్రకటన వెలువరించలేదు. ఈ రెండు గ్రామాల్లో వీధుల్లో జనం చేతులు కట్టివేసి, వారిని నరికివేసిన అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఇండ్లు తగులబడి పోతూ కన్పించాయి. ఉగ్రవాద మూకల అత్యంత పైశాచిక చర్యకు ఇది పరాకాష్ట అని ఇక్కడి గవర్నరు అబ్దుల్ రెహ్మన్ అబ్దుల్ రజాక్ ఈ ఘటనలను ఖండించారు.