
మన తెలంగాణ/హైదరాబాద్ : విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పద రీతిలో మరణించింది. విధుల్లో ఉండగానే కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గదిలో విద్యార్థిని మరణించినట్లు గుర్తించిన సహచరులు వెంటనే పోలీసులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాకు చెందిన దీపిక ఎంబిబిఎస్ పూర్తిచేసి అనస్తీషియా విభాగంలో పిజి చేస్తోంది. విజయవాడ వైద్య కళాశాలలో చదువుతున్న దీపిక విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆమె డ్యూటీ చేయాల్సి ఉంది. అయితే, బుధవారం సాయంత్రం డ్యూటీకి వచ్చిన కాసేపటికే కడుపునొప్పిగా ఉందని తోటి వైద్య విద్యార్థులకు తెలిపింది.
దీంతో ఓ విద్యార్థిని ఆమెకు ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత విధుల్లో నిమగ్నమైన దీపిక రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై ఒరిగిపోయింది. వెంటనే ఆమెను పరీక్షించిన సహచరులు పిక అప్పటికే మరణించిందని గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి సిసి కెమెరాల పరిశీలనాంతరం దీపిక ఆత్మహత్యకు పాల్పడిందా?లేక మరేదైనా కారణమా? అనేది వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీపికది అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామని, అనంతపురం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చాక వారి ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. వైద్య విద్యార్థిని దీపిక మరణంపై మంత్రి సత్యకుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.