Reading Time: 2 minutes

ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంలోని జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకపోవడం అధికార వర్గాలకు విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తోంది. నరవణె పుస్తకంపై సోమ, మంగళవారాల్లో కూడా వివాదం కొనసాగింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ నరవణె చీఫ్ తన పుస్తకంలో అప్పటి సంఘటనలు కొన్ని ప్రస్తావించారు. ఈ సంఘటనలకు సంబంధించి ఓ మేగజైన్‌లో వచ్చిన వ్యాసాన్ని సోమవారం సభలో రాహుల్ ఉదహరించడానికి ప్రయత్నించగా స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. స్పీకర్ సూచించిన మేరకు దానిని తాను ధ్రువీకరిస్తున్నట్టు మంగళవారం రాహుల్ సభలో ప్రకటించారు. ఈమేరకు సంతకం చేసిన ఆ కాపీని స్పీకర్‌కు సమర్పించారు. దానిని పరిశీలించాక స్పందిస్తానని స్పీకర్ ప్రకటించారు. అయినా నరవణె అంశంపై మాట్లాడడానికి రాహుల్ ప్రయత్నించడంపై అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురై చివరకు వివాదంగా కొనసాగుతోంది.

2020లో సరిహద్దు లోని గల్వాన్ లోయ వద్ద చైనా సేనలు దురాక్రమణ సాగించినప్పుడు భారత ప్రభుత్వం ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించిందో తగిన ఆదేశాలు జారీ చేయకుండా సైన్యం విచక్షణాధికారానికే ఎలా విడిచిపెట్టిందో ఆ వ్యాసంలో ఉదహరించారు. దాన్నే సభలో చర్చకు తీసుకురావడానికి రాహుల్ ప్రయత్నించగా రాహుల్ గొంతు వినిపించకుండా ప్రభుత్వం అడ్డుపడింది. 2020 నాటి గల్వాన్ లోయ సంఘటనలు అణు సామర్థం కలిగిన చైనా, భారత్ దేశాల మధ్య సంబంధాలను ఎలా నష్టపరిచాయో నరవణె వివరించారు. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అన్న పేరుతో నరవణె రచించిన ఈ పుస్తకం 2023 నుంచి ముద్రణకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. చైనా యుద్ధ టాంకులు, పదాతి దళాలు భారత్ వైపు కైలాష్ పర్వత శ్రేణిలో దూసుకు వస్తుండగా ప్రభుత్వ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైనిక దళాల బాధ్యతకే విడిచిపెట్టినట్టు తెలుస్తోంది.

క్లిష్టమైన పరిస్థితుల్లో సుదీర్ఘ పరిణామాలు ఎదురైనప్పుడు ప్రభుత్వ రాజకీయ నాయకత్వమే చొరవ తీసుకునే వ్యవస్థ స్వతంత్ర భారతంలో అభివృద్ధి చెందింది. అధికార నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే అధికారులు, సిబ్బంది పాటించవలసి ఉంటుంది. ఇలాంటి కార్యకలాపాల నిర్ణయాల విషయంలో మోడీ తరచుగా జోక్యం చేసుకుంటారని, సలహాలు ఇస్తుంటారని చెబుతుంటారు. 2025 ఏప్రిల్ లో పహల్గామ్ దాడి తరువాత ప్రధాని మోడీ నేతృత్వం లోని భద్రతా కమిటీ, రక్షణ దళాలకు పాకిస్థాన్‌పై ప్రతిస్పందన విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు, దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను ప్రధాని మోడీయే సమీక్షించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. అలాంటిది గల్వాన్ లోయ సంఘర్షణలో మోడీ ప్రభుత్వం సరైన రీతిలో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే నవరణె పుస్తకం లోని అంశాలు వెలుగు లోకి వస్తే తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న భయంతో మోడీ ఆ పుస్తకం ముద్రణకు అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకనే ఆ పుస్తకం లోని అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.

సరిహద్దుల వద్ద పరిస్థితిని ‘మిలిటరీ నిర్ణయం’ అని చెప్పి ప్రధాని మోడీ బాధ్యత నుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని లేదా ఏది సరైనదో అదే చేయండి అని చెప్పడం ద్వారా సైన్యానికి బాధ్యతను బదిలీ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నరవణె పుస్తకం చదివితే చైనా మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు మనదేశ నాయకత్వం దానిపై ఎలా స్పందించిందన్న బండారం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రియాంక గాంధీ తాజాగా ఆరోపించారు. గతంలో ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవని, కానీ ఇప్పుడు ఓ వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమే ముందుకు తీసుకు వస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేతను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని, ఇలా జరగడం మన పార్లమెంట్ చరిత్ర లోనే తొలిసారి అని రాహుల్ మండిపడ్డారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై విపక్ష నేతను లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని రాహుల్ ధ్వజమెత్తారు. చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దు ఘర్షణల్లో భారత దేశం వ్యూహాత్మక లాభాలను, నష్టాలను చవి చూసింది.

2020 లో గల్వాన్ లోయ ఘర్షణ తరువాత సరిహద్దులో పరిస్థితి నిరంతరం మారుతూ వచ్చింది. చైనా వాస్తవాధీన రేఖ వద్ద సుమారు 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తన నియంత్రణ లోకి తీసుకుందని అంచనా. అయితే ఈ నేపథ్యంలో ఆత్మవిశ్వాసం గల ప్రభుత్వం సత్యాలను వెలుగులోకి రానిస్తుంది. దీనిద్వారా తన భాగస్వాములను సరైన పాఠాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్ నరవణె పుస్తకాన్ని ముద్రణకు అనుమతినీయకుండా పెండింగ్‌లో ఉంచడానికి బదులు తక్షణం ముద్రణకు అనుమతిస్తే ఏవి వాస్తవాలో, ఏవి కావో పార్లమెంట్‌లో చర్చించడానికి వీలవుతుంది. లోపాలను సరిచేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. పార్లమెంట్‌లో చర్చలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అప్పుడు అడ్డుకోవచ్చు. సరిహద్దుల్లో లక్షల చొరబాటుదార్ల వల్ల జనాభాలో మార్పులు వచ్చి తీరని నష్టం కలుగుతోందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమ ప్రచారంలో ఊదరగొడుతున్న సమయంలో సరిహద్దులో ఘర్షణలను ఎందుకు గట్టిగా నివారించలేకపోతున్నారో అన్న ప్రశ్న ఎదురవుతోంది.