
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026 ముగింపు దశకు చేరుకొంది. గురువారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్‌సిబి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఢిల్లీ మాత్రం ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గుజరాత్‌పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ తుదిపోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఓపెనర్లు లిజెల్లి లీ, షఫాలీ వర్మలు ఫామ్‌లో ఉన్నారు. గుజరాత్‌పై లీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.
షఫాలీ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కూడా గుజరాత్‌పై మెరుపులు మెరిపించింది. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. లౌరా వాల్వర్డ్, మరిజానె కాప్, మిన్ను మణి తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. స్నేహ్ రాణా, శ్రీచరణి, మిన్ను మణి, మరిజానె కాప్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే.
ఇక కిందటి మూడు సీజన్‌లలో ఫైనల్లో ఓటమి పాలైన ఢిల్లీ ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే పటిష్టమైన బెంగళూరును ఓడించి ట్రోఫీని సాధించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. మరోవైపు బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. గ్రేస్ హారిస్, స్మృతి మంధాన, జార్జియా వోల్, రిచా ఘోష్, రాధా యాదవ్, నడైన్ డి క్లర్క్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.