
జనగామ మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి ఆలేరు మండలం టంగుటూరు నుండి జనగామ మండలం పెంబర్తికి వెళ్లే మార్గంలో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా పెంబర్తి గ్రామానికి చెందిన ఇట్టబోయిన రమేష్‌కు చెందిన పొలంలో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి. అలాగే ఇక్కిరి రాజు వ్యవసాయ బావి, నిమ్మల సుధాకర్ రెడ్డి తోటల వద్ద కూడా పులి సంచరించినట్లు గుర్తులు లభ్యమయ్యాయి. మరోవైపు, జనగామ మండలం శామిర్‌పేట గ్రామంలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఆవరణలో మంగళవారం రాత్రి 11:00 గంటల సమయంలో పులి తిరుగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పులి సంచార వార్తతో పెంబర్తి, శామిర్‌పేట మరియు చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా బయట తిరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పులి కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు.
చిరుత దాడితో లేగ దూడ మృతి
తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో గత రెండు నెలలో నుండి, చిరుత దాడుల్లో మేకలు, గొర్లు, పాడి పశువులు,లేగ దూడలపై చిరుతపులి దాడి చేసి చంపడంతో, రైతన్నలు వ్యవసాయ క్షేత్రాలు పనులు చేసుకోవాలంటే భయంతో ఎక్కడి నుండి చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాభ్రాంతులకు గురవుతున్న సమయంలో నందివాడ గ్రామంలో మంగళవారం, సంకు రామవ్వ వ్యవసాయ క్షేత్రంలో రైతు సంకు రాజు మంగళవారం పాడి పశువులను రోజువారీగా తన కోట్టం పందిరిలో కట్టి వేయగా బుధవారం వ్యవసాయ క్షేత్రం వెళ్లి చూడగా ఏదో అడవి వన్యమృగం చంపి తిన్నదని గమనించి తన గ్రామ సర్పంచ్ అధికారులకు తెలుపగా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారంతో వ్యవసాయ క్షేత్రం పరిశీలించి , చిరుత పులి లేగ దూడపై దాడి చేసి చంపిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ తెలియజేశారు.
రైతులు ఎవరు వ్యవసాయ క్షేత్రాలలో పాడి పశువులు మేకలు గొర్రెలను కట్టి వేయవద్దని , రైతులు జాగ్రత్తగా ఉండాలని, చిరుత పులిని బంధించడానికి బోనులను, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు చిరుత పులి దాడిలోమృతి చెందిన పశువులు, రైతు బాధితులకు ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి బాధిత రైతుల బ్యాంకు ఖాతాలోకి పరిహారం అందిందని, వివరాలను అయన తెలియజేశారు. ఎర్రపహడ్ గ్రామ రైతుకు 9,000 , గాంధీ నగర్ లో 15000 ,దేమోకలన్ రైతుకు 2500 మోతే గ్రామ బాధిత రైతుకు 22,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఆయన తెలియజేశారు. నందివాడ గ్రామంలో మంగళవారం జరిగిన చిరుత దాడిలో మృతిచెందిన లేగ దూడ 15 నుంచి 20వేల వరకు ఉంటుందని తాడ్వాయి మండల పశు వైద్యాధికారికి పంచనామా చేసినట్లు ఆయన తెలియజేశారు.