
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశాయి. ఉదంపూర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు, సిఆర్‌పిఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులు ఓ గుహలో దాక్కున్నారు.
ఉగ్రవాదులు గుహలో ఉన్నట్లు సమాచారం అందడంతో మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులకు ఎలాంటి హానీ జరగకుండా ఈ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఉగ్రవాదులను గుర్తించి ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ జాతీయుడు కాగా, మరొకరు స్థానికుడు. వారి నుంచి ఎం4 కార్బైన్ రైఫిల్స్, ఎకె-47 రైఫిల్స్, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.