
ఐసిసి టి-20 ప్రపంచకప్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నమెంట్‌కి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం తీసుకుంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. పలువురు సీనియర్లు పాక్ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ అశ్విన్ పాక్ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ నాలుగైదు రోజుల్లో దారికొస్తుందని అశ్విన్ పేర్కొన్నాడు.
‘‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది. మరో నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారిలోకి వస్తుంది. నేను కూడా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే వచ్చే నష్టాల గురించి కూడా అశ్విన్ తెలిపాడు. ‘‘పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదురుకోవాల్సి వస్తుంది. బ్రాడ్‌కాస్టర్లు భారీగా నష్టపోతారు. మిగితా బోర్డులు ఇబ్బంది పడతాయి. ఐసిసి మీటింగ్‌లో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. పిఎస్ఎల్ కోసం విదేశీ ఆటగాళ్లకు ఎన్‌ఒసిలు రావు’’ అని అన్నాడు.
అయితే ఇప్పటికే భారత్, పాకిస్థాన్‌లు తటస్థ వేదికలపై తలపడుతున్నాయని.. కాబట్టి ఇక్కడ వేదిక అనేది సమస్య కాదని అశ్విన్ వెల్లడించాడు. ‘‘ఓ ప్రత్యర్థితో మేము మ్యాచ్ ఆడమనడం ఆమోదయోగ్యం కాదు. పాకిస్థాన్‌కు పాకిస్థానే పెద్ద శత్రువు.. దీనంతటికి వారి మైండ్‌సెట్టే కారణం’’ అని అశ్విన్ అన్నాడు.