Reading Time: 2 minutes

హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం సముద్రాల సరిహద్దులతో ఏర్పడిన ద్వీప దేశంగా భారత దేశ తీరానికి 50 కి.మీ దూరంలో ఉన్న శ్రీలంక 04 ఫిబ్రవరిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లలో మునిగి ఉన్నది. 1972 వరకు ఈ ద్వీపాన్ని ‘సిలోన్’గా పిలవడం జరిగేది. 1948లో పాక్షిక స్వాతంత్య్రం పొంది, 22 మే 1972లో పూర్తి స్వాతంత్య్రం పొందిన తర్వాత 1978, 04 ఫిబ్రవరి రోజున బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది అధికారికంగా ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర శ్రీలంకగా రూపాంతరం చెంది ప్రెసిడెన్షియల్ -పార్లమెంటరీ మిశ్రమ వ్యవస్థగా తనదైన రాజ్యాంగంతో అనేక ఒడుదుడుకులు మధ్య నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని 04 ఫిబ్రవరి 2026న నిర్వహించుకుంటున్నది.

పశ్చిమ ఈశాన్య భారత బెంగాల్, ఒడిశా నుంచి వలస వచ్చిన ఆధునిక ఇండో-ఆర్యన్ సెటిలర్స్‌ను సింహలీస్ అని పిలవడం జరుగుతున్నది. ప్రస్తుతం 23.5 మిలియన్ల శ్రీలంక జనాభాలో 75 శాతం సింహలీస్, 11 శాతం శ్రీలంక తమిళులు, 9 శాతం వరకు ముస్లిం మూర్‌లు, 4 శాతం భారత తమిళుల జనాభా ఉన్నది. అత్యధిక సింహలీలు బుద్ధిస్టులుగా, తమిళులు హిందువులుగా రెండు గ్రూపుల మధ్య విభేదాలతో రెండున్నర దశాబ్దాలపాటు ఎల్‌టిటిఇ, అధిక జనాభా ఉన్న సింహలీస్ (ప్రభుత్వ సహకారంతో) మధ్య వర్గ పోరు (1976- 2002) కూడా జరగడం, అనేక హింసాత్మక ఘటనలు చేటు చేసుకోవడం, చివరికి ఎల్‌టిటిఇ పోరాటాలను అడ్డుకోవడం, అంతం చేయడం చూసాం. శ్రీలంక ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాల నడుమ కొనసాగుతున్న శ్రీలంక ప్రయాణంలో ఆహార, ఇంధన, ఔషధాల కొరతలు కూడా తోడుకావడంతో పలు ప్రజా ఉద్యమాగ్నులు ఎగిసిపడడం చూసాం. శ్రీలంక సంస్కృతి, నాగరికతను పరిశీలిస్తే దానిపై బుద్ధిస్టుల, హిందువుల, వలస పాలకుల, జాతి వైవిధ్య, ఆధునిక ప్రపంచీకరణ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనుపిస్తాయి.

శ్రీలంకలో సామాజికపరంగా కులమత వ్యవస్థలు భారతదేశంలో ఉన్నట్లుగానే కనిపిస్తాయి. 16వ శతాబ్దంలో శ్రీలంక తీరప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలో, 17వ శతాబ్దంలో డచ్‌ల ఆధీనంలో పాలన కొనసాగింది. 1796 నుంచి ఈ ద్వీప ప్రాంతం బ్రిటీష్ ఆధీనంలోకి క్రమంగా మారడం, 1833లో పూర్తిగా బ్రిటీష్ పాలన పగ్గాలు చేపట్టి ఈ ద్వీపానికి ‘సిలోన్’గా నామకరణం చేసి వలస పాలన కొనసాగించడం, వలస పాలన 1948 వరకు కొనసాగడం చూసాం. సిలోన్ ప్రాంతం 1972లో శ్రీలంక రిపబ్లిక్‌గా పేరు మారడం, 04 ఫిబ్రవరి 1948న పూర్ణ స్వాతంత్య్ర పొందిన తనదైన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర శ్రీలంకగా రూపాంతరం చెందడం జరిగింది. శ్రీలంక రాజధానిగా ‘శ్రీ జయర్ధనేపుర కొట్టె (కొలంబో)’ పాలన కేంద్రంగా పని చేస్తున్నది. శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నిక ద్వారా ఎంచుకోవడంతోపాటు 225 మంది కలిగిన లెజిస్లేటివ్ పార్లమెంట్ ద్వారా ప్రధాన మంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ‘అరుణ కుమార దిసనాయకె’, ప్రధానిగా ‘హరిణి అమరసూర్య’లు సేవలు అందిస్తున్నారు. గతంలో దీర్ఘకాలం పాటు శ్రీలంకకు పెద్దన్నవలే నిలిచింది మన భారత్. ప్రస్తుత డిజిటల్ యుగంలో మారుతున్న సమీకరణాల ఆధారంగా ఆర్థిక చేయూత బూచీ చూపుతూ చైనా నాయకత్వం శ్రీలంకను మచ్చిక చేసుకోవడం చూస్తున్నాం. 04 ఫిబ్రవరి 2026న శ్రీలంక జరుపుకుంటున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవం -2026 ఇతివృత్తంగా శ్రీలంకను నిర్మించుకుందాం (లెట్జ్ బిల్ శ్రీలంక) అనే అంశాన్ని తీసుకొని ఘనంగా నిర్వహించుకోవడానికి భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకల్లో రాజధాని కేంద్రంగా జాతీయ పతాకాన్ని ఎగిరేయడం, ఆకర్షణీయ రక్షణ దళాల కవాతులు, సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ ఘన కీర్తిని చాటే ప్రదర్శనలు లాంటివని అనేకం నిర్వహిస్తారు. అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక రానున్న రోజుల్లో శాంతియుతంగా ప్రగతి పథాన స్థిరంగా అడుగులు వేయాలని కోరుకుందాం. మన పొరుగు దేశవాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. 

డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037