Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రైల్వే హబ్ గా హైదరాబాద్ మారబోతున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. యాదగిరి గుట్టకు ఎంఎంటిఎస్ మార్గం వేసేందుకు త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని ఆయన చెప్పారు. బడ్జెట్ అంటే ఉచితాలు ఇవ్వడం కాదని ఆయన మంగళవారం పార్టీ ముఖ్య నేతలు ఎన్‌వి సుభాష్, వెంకట్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. త్వరలో కాంగ్రెస్ కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో కనుమరుగు కాబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు.రైల్వేకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా హైదరాబాద్ కు ప్రాజెక్టులు కేటాయించిందని, 2009-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రైల్వే మౌలిక సదుపాయాలు,

ప్రాజెక్టుల కోసం అప్పటి ప్రభుత్వం రూ.886 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం ఏకంగా 6 రెట్లు అధికంగా రూ.5,454 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అమృత్ భారత్ పథకం ద్వారా 42 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని. వాటిలో ఇప్పటికే 5 స్టేషన్లు పూర్తి అయ్యాయని,ఇంకా బేగంపేట, కరీంనగర్, వరంగల్, చర్లపల్లి స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని ఆయన తెలిపారు. త్వరలోనే కొమురవెల్లి మల్లన్న, జోగులాంబ రైల్వే స్టేషన్లు కూడా పూర్తికానున్నాయని, 2026లో 30 కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లు కేటాయించారని,

2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 900 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అందులో బేగంపేట, కరీంనగర్, వరంగల్, చర్లపల్లి స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానున్నదని, దేశంలో 7 హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు మన హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయని, అవి హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై అని ఆయన తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశ నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లతో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యాదగిరిగుట్టకు ఎంఎంటిఎస్ లైన్ ను తీసుకొచ్చి, భక్తులకు అందుబాటులోకి తేనున్నామని, త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. మేడారానికి 3 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ నిధులను ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. నిధులు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు చేసిన విమర్శను ఆయన తోసిపుచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులను మంత్రులు పంచుకోకుంటే చాలు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

అన్ని వర్గాలకూ మేలు చేసే బడ్జెట్..

కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు. బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బడ్జెట్ ప్రవేశ పెడతారనే ప్రజల ఆలోచనకు, భావనకు భిన్నంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన వివరించారు.రాష్ట్రంలో ఉన్న 23 లక్షల ఎంఎస్‌ఎంఇలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్లో వచ్చే ఐదేళ్ల కోసం రూ.10 వేల కోట్లతో ప్రకటించిన బయోఫారా ‘శక్తి’ కార్యక్రమం ద్వారా ఫార్మా క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్‌డకు చాలా మేలు జరగనుందని అన్నారు.తెలంగాణలో దాదాపు 5 వేల కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు.

రూ.2,471.76 కోట్ల వ్యయంతో 64 కిలో మీటర్ల పొడవున ఆర్మూర్- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని ఆయన చెప్పారు. రూ.2,484 కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల మేర జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారి నిర్మించనున్నాట్లు ఆయన తెలిపారు. రూ.2,730 కోట్ల ఖర్చుతో 68 కిలో మీటర్ల పొడవున 4 లేన్లతో ఆర్మూరు-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని ఆయన వివరించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగం)కు రూ.21,629 కోట్లను కేంద్రం కేటాయించిందని, రాష్ట్రంలో రూ.42 వేల కోట్ల నిధులతో కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.