Reading Time: < 1 minute

చెన్నై: నిజాయితీకి నిలువుటద్దం అనిపించుకున్న పారిశుద్ధ కార్మికురాలు పద్మకు సూపర్‌స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసును బహుమతిగా ఇవ్వడం అందరినీ ఆకట్టుకొంటోంది. పద్మ తన కుటుంబీకులతో కలిసి మంగళవారం పొయస్ గార్డెన్ లోని రజనీ కాంత్ నివాసానికి వెళ్లి ఈ బహుమతిని అందుకున్నారు. శాలువాతోపాటు, ఓం అనే డాలరుతో ఉన్న రెండు సవరల బంగారు హారాన్ని ఆమెకు బహూకరించి సత్కరించారు. ఇటీవల రోడ్డుపై తనకు లభించిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని పారిశుద్ధ కార్మికురాలు పద్మ అసలైన యజమానికి పోలీసుల ద్వారా అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు.

ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని భావోద్వేగంతో అన్నారు. పద్మతోపాటు ఇద్దరు కుమార్తెలు, భర్త వచ్చారు. సద్మ నిజాయితీని అభినందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవలనే పద్మ నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించి రూ. లక్ష చెక్కును బహుమతిగా అందజేశారు. టి నగర్‌లో పారిశుద్ధ విధులు నిర్వహిస్తుండగా పద్మకు రోడ్డుపై ఒక సంచి కనిపించింది. అది విప్పి చూడగా అందులో 45 సవరల బంగారు ఆభరణాలు కనిపించాయి. పై అధికారులకు ఈ సంగతి తెలియజేసి ఆ ఆభరణాల సంచిని పాండీ బజార్‌పోలీసులకు అప్పగించింది. వారు దర్యాప్తు చేసి అసలు యజమానికి ఆ నగలు అప్పగించగలిగారు. పద్మకు రజనీకాంత్ సత్కరించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.