
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (80) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి. గ్రామస్థాయి నుండి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. 1994లో టిడిపి నుంచి రాంరెడ్డి మొదటిసారిగా మంథని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. ప్రజా సమస్యలను తనవిగా భావించి పని చేశారు. రైతుల కష్టాలు, గ్రామీణ అభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. రామన్నగా పేరు తెచ్చుకున్న రాంరెడ్డి రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైంది. రాంరెడ్డికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. రాంరెడ్డి మృతి పట్ల పలువరు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.