
చెన్నై: చెన్నై మహానగర పాలక సంస్థలో కార్మికురాలిగా పని చేసే పద్మ(50)కు ఇటీవల రోడ్డుపై 45 తులాల బంగారం దొరికింది. దాన్ని పోలీసులకు అప్పగించి ఆమె అందరి మన్ననలు పొందారు. ఈ విషయం సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తెలిసి ఆమె పద్మను ఇంటికి పిలిపించుకున్నారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడిన రజనీ అనంతరం ఆమెను సన్మానించారు. పద్మకు ఓ బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు.
ఇక పద్మకు భారత తపాల శాఖ ఇటీవల అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫోటోతో కూడా ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించారు. ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున.. రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించిన సంగతి తెలిసిందే.