
మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్‌లో ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో డిపిఆర్ ఇస్తే.. పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదంతో నిధులు వస్తాయని తెలిపారు. ప్రస్తుత మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తానని చెప్పిందని.. టేకోవర్ ప్రక్రియ పూర్తి చేసి డిపిఆర్ ఇస్తే కేంద్రం ఆమోదిస్తుందని అన్నారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసు ఓ టివి సీరియల్‌లా కొనసాగుతోందని విమర్శించారు. కేసు మొదలై ఇప్పటికే రెండేళ్లు అయిందని.. ఇంకా ఎన్నాళ్లో తెలియదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిజమని.. స్వయంగా కెసిఆర్ కుమార్తెనే చెప్పారని అన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని అఫిడవిట్ వేశారని.. నేతలు, జడ్జిలు, వ్యాపారులు, నటుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రానికి మూడు హై స్పీడ్ రైళ్లు రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. డేటా సెంటర్లకు ఉపయోగపడే నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నదని అన్నారు. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో రాష్ట్రానికి కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. విదేశీ విద్యపై ఉండే పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎరువులకు రాయితీని కూడా కేంద్రం పెంచిందని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని రైతులు కూడా లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుందని.. రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరు అవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.