Reading Time: < 1 minute

అమరావతి: నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు సిఎం పర్యటించారు. డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్ల పంపిణీ చేశారు. శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తులసినాయనపల్లి ప్రజావేదిక లో ప్రసంగించారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని, ఇంటిపై ఉత్పత్తియ్యే విద్యుత్ తోనే సైకిల్ కు ఛార్జింగ్ చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ సూపర్ సైకిల్.. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుందని, సైకిల్ కు ఓటు వేశారు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని అన్నారు.

తప్పులు చేసిన వాళ్లకు నిద్ర రాదు.. వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయని, నిద్ర చాలా ముఖ్యం.. మంచి చేస్తే సుఖంగా నిద్రపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. శరీరానికి కొంత వ్యాయామం కూడా అవసరమని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని అనునిత్యం నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 12 నుంచి శుక్రవారం మ.12 వరకు 5,555 ఈ సైకిళ్లు విక్రయించామని అన్నారు. రూ.35 వేల విలువైన సైకిల్ ను రాయితీపై రూ.24 వేలకు విక్రయం చేశామని అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలి.. పేదవాళ్లకు అందాలి.. అని.. పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెరిగి ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒక సంకల్పంతో సూపర్ సిక్స్ ను.. సూపర్ హిట్ చేశామని, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.