Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎస్. జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవిత ఖైదీలు సహా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18, 2025 నాడు స్వయం స్వీకరణ రిట్ పిటిషన్ క్రిమినల్ నం. 4/2021 తో పాటు ఎస్‌ఎల్‌పి (క్రిమినల్) నం. 529/2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖ ద్వారా జీవిత ఖైదీలకు ప్రత్యేక రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించి శాశ్వత మార్గదర్శకాలను నిర్ధారిస్తూ అక్టోబర్ 27, 2025 తేదీన జి.వొ.ఎంఎస్.నెం.126 ను జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులో అర్హత గల జీవిత ఖైదీలను గుర్తించడం, వారి కేసులను ముందస్తు విడుదలకు పరిశీలించడం కోసం అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రమాణాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయన్నారు.సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసి దాదా పు ఒక సంవత్సరం పూర్తవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు మూడు నెలలు గడిచాయి. అయినప్పటికీ ఈ ముందస్తు విడుదల విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు.

జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనతో, ఆందోళనతో జీవిస్తున్నారని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శిక్ష అనుభవిస్తున్న, అర్హులైన తమ వారిని విడుదల చేస్తారని ఆశించారన్నారు. కానీ అది జరగలేదని తెలిపారు పైన పేర్కొన్న జి.వొ. .ప్రకారం, జైళ్ల శాఖ, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి, స్టాండింగ్ కమిటీ ముందు ఉంచాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం అర్హులైన ఖైదీలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు ఖైదీలకు గానీ, వాళ్ళ బందు వులకు గానీ సమాచారం లేదన్నారు.

ఈ విధమైన నిర్లక్ష్యం సుప్రీంకోర్టు గుర్తించిన రెమిషన్, సంస్కరణ ,రాజ్యాంగ బద్ధమైన స్వేచ్ఛ, మౌలిక స్ఫూర్తికే విరుద్ధమన్నారు. న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియను వేగ వంతం చేయాలన్నారు. జి.వొ.ఎంఎస్.నెం.126 ను సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాల వెలుగులో యధాత దం గా అమలు చేసి, అర్హత గల జీవిత ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని కోరిందన్నారు.