Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. మీకు బీరు కంపెనీలు ముఖ్యమా… రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీలే ముఖ్యం అంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీశ్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారని ఈ ప్రాజెక్టు కింద. 40వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. ఇదే సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫలా జరుగుతోందని ఇది మద్యం తయారీదారు ప్రభుత్వమా? లేక రైతు ప్రభుత్వమా? అని నిలదీశారు.

అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీటి సరఫరా ఆపి బీర్ల కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశించారని ఆరోపించారు. తెలంగాణలో మరో కొత్త స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అబ్కారీ శాఖలో ఓ ముఖ్యనేత, మంత్రి కోటా కింద అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా మైక్రో బేవరేజెస్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఇందుకోసం 110 అప్లికేషన్లు వస్తే తొలుత 25 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో మంత్రి కోటా 4, మరో ముఖ్య నేత కోటా కింద 21 మైక్రో బెవరేజులను సెలెక్ట్ చేసుకున్నారని పంచుకున్నారని ఆరోపించారు.

ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఆ నాయకుడు ఉంటున్నాడని, ఈ మధ్య వార్తల్లో కూడా ఉన్నారని ఆరోపించారు. కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుందని, ఈ మధ్య ఈ ముఖ్య నేత తిరుపతి వెళితే సదరు నేత నీడగా వెంటే ఉన్నాడని ఆరోపించారు. ఒక్కో బ్రూవరీకి 1.80 కోట్లుగా ధర నిర్ణయించారని ఇందులో రూ.ఒక్కటిన్నర కోటి ముఖ్యనేతకు, మిగతా రూ.30 లక్షలు తోడు నీడ కు అని ఆరోపించారు. 21 తోడు నీడ ఫైనల్ చేసుకుంటే 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారన్నారు.

మైక్రో బేవరేజీల కోసం 110అప్లికేషన్లు వచ్చాయని అంటున్నారని అలాంటప్పుడు వైన్స్‌లకు లాటరీ తీసినట్టు వీటికి ఎందుకు లాటరీ తీయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4500 కోట్లు బకాయిలు పడ్డారని, కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడు కూడా ఈ విధమైన పరిస్థితి లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 15 రోజుల్లో చెల్లింపులు జరిగేవన్నారు. బకాయిల వల్ల సరఫరా ఆగిపోయిందని దీంతో చాలా షాపుల్లో సరుకు అందుబాటులో లేకుండా పోతోందన్నారు. ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయని లేఖలు కూడా రాశాయన్నారు. వాటాల పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నదని దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోందన్నారు. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టారని హరీష్‌రావు ఆరోపించారు.