Reading Time: 2 minutes

ఉత్తర తెలంగాణ జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ది చెందిన వీరభద్ర స్వామి ఆలయం జాతరకి సిద్ధం అయినది. కోర మీసాల స్వామిగా చరిత్ర కెక్కిన ఈ ఆలయం విశిష్టత గురించి అందరు తెలుసుకోవాలసిందే. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉన్న ఆలయం. క్రీ.శ.1600వ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొందమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారు. వంట చెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయారు. కాసేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్టిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పడంతో, గుట్ట కింద వీరభద్రస్వామిని ప్రతిష్టించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు.

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరము జనవరి నెలలో సంక్రాంతి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రాధాన ఆకర్షణ సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కల్యాణంతో బ్రహ్మోత్సవాలతో ప్రారంభమవుతూ వుంది. 11న త్రిశూల పూజ, 12న వాస్తు పూజ, 13న లక్ష బిల్వార్చన, 14 న భోగి పండుగ, 15న మకర సంక్రాంతి పురస్కరించికుని ఉత్తరాయణ పుణ్య కాలం

బండ్లు తిరుగుట(జాతర), 16న కనుమ వేడుక పుష్ప యాగం 17న మహా పూర్ణ హుతి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలగా ఉంటాయి. ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి ఒక్కరు వీరభద్ర స్వామిని దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవాలి. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని ధర్శించుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కాక సిద్దిపేట, హుస్నాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్ద పల్లి, హుజురాబాద్, జమ్మికుంట, హైదరాబాద్‌ల నుండి భక్తులు వేలాదిగ వచ్చి దర్శనం చేసుకుంటారు. వివిధ గ్రామాల నుండి ఎడ్ల బండి మీద కూడా ఇప్పటికి జాతరకి వస్తూ వుంటారు. వివిధ ఆర్టీసీ డిపోల నుండి బస్సులు భక్తులను జాతరకు తరలిస్థూ వుంటారు. జాతరకు వచ్చె భక్తులకు ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అన్ని వసతులు కల్పించినది. చలువ పందిళ్లు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేసారు.

వైద్యం, మంచి నీటి సౌకర్యం కల్పించారు ఆర్టీసి కూడా తదితర ఏర్పాట్లు చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక కుం డా పోలీస్ శాఖ కట్టు దిట్ట మయిన చర్యలు తీసుకుంటుంది స్థానిక శాసన సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వామివారికి మంత్రి పొన్నం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముత్యాల తలంబ్రాలను కూడా అందించనున్నారు. ఆలయ ఈవో కిషన్ రావు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోరమీసాల వీరభద్రుడికి జై..జై..

(జనవరి 10 నుండి జాతర ప్రారంభం సందర్భంగా.. )

కామిడి సతీష్ రెడ్డి

98484 45134