Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్‌సి) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వైఐఐఆర్‌సి నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం బాలికలకు స్కూల్స్ కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలని తెలిపారు. విద్యాశాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. వైఐఐఆర్‌సిలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పిఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారు. వైఐఆర్‌ఆర్‌సిల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని చెప్పారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు.

తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయపాత్ర ప్రతినిధులు సిఎంకు తెలిపారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాచుపల్లి పాఠశాల స్థలం కేవలం అర ఎకరం మాత్రమే ఉండడంపై సిఎం ఆరా తీశారు. ఎక్కడైనా పాఠశాలకు కనీసం ఎకరంన్నర స్థలం ఉండాలని, బాచుపల్లి ప్రస్తుతం ఉన్న స్థలం సమీపంలో ఎకరంన్నర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని ఆదేశించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు.

మహిళా విశ్వవిద్యాలయం పనులు వేగవంతం చేయాలి

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం పనులు వేగవంతం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన ఉండాలన్నారు. సమావేశంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సిఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.