Reading Time: < 1 minute

Padma Awards 2026: రాష్ట్రపతి భవన్ లో..పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

Caption of Image.

2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సోమవారం(మే25) సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరణానంతరం ప్రముఖ హిందీ నటుడు ధర్మేంద్రకి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఆయన సతీమణి హేమామాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వయోలనిస్టు ఎన్‌.రాజమ్‌కు పద్మవిభూషణ్ ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 

2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 5 పద్మ విభూషణ్‌, 13 పద్మ భూషణ్‌, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అధికారిక వివరాల ప్రకారం తొలి విడతలో 66 మందికి  అవార్డులు అందజేస్తున్నారు. ఈరోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పద్మ విభూషణ్‌, 6 పద్మ భూషణ్‌, 58 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. మిగిలిన పద్మ అవార్డు గ్రహీతలకు ఈ ఏడాది తర్వాత నిర్వహించే రెండో విడత పురస్కార ప్రదాన కార్యక్రమంలో అందిస్తారు.

ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఇవి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. కళలు, సామాజిక సేవ, సాహిత్యం, వైద్యం, విజ్ఞానం, ఇంజినీరింగ్‌, క్రీడలు, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, సివిల్ సేవలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.

పద్మ విభూషణ్‌ అత్యున్నత స్థాయి విశిష్ట సేవలకు ఇస్తారు. పద్మ భూషణ్‌ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ప్రదానం చేస్తారు. ఏ రంగంలోనైనా విశేష సేవలు అందించిన వారికి పద్మశ్రీ పురస్కారం అందజేస్తారు.

©️ VIL Media Pvt Ltd.