Reading Time: < 1 minute

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..హైవేపై ఒకదానికొకటి ఢీకొన్న ఏడు కార్లు, లారీ

Caption of Image.

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి దగ్గర 44వ  నేషనల్ హైవే పై వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. 

హైవేపై వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో.. ఆ ట్రక్కు రోడ్డుపైనే అకస్మాత్తుగా ఆగిపోయింది. దాంతో వెనుక వస్తున్న వాహనదారులు అప్రమత్తం అయ్యేలోపే.. ఒకదానికొకటి వరుసగా ఏడు కార్లు అత్యంత వేగంగా ఢీకొట్టుకున్నాయి. అదే సమయంలో ఆ కార్ల వెనుక నుంచి వచ్చిన ఒక  కొబ్బరి బొండాల లారీ  కార్లను పక్క నుంచి బలంగా ఢీకొంటూ రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘోర ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రత భారీగా ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

 ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అటు బాధితులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

©️ VIL Media Pvt Ltd.