Reading Time: 2 minutes

IPL 2026: ఢిల్లీ కోటలో భువీ, హేజిల్‌వుడ్ విధ్వంసం.. పేకమేడలా కూలిన క్యాపిటల్స్ బ్యాటింగ్

Caption of Image.

DC vs RCB: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతుందని ఆశించిన అభిమానులకు.. ఆర్‌సీబీ పేసర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం షాక్‌కు గురి చేసింది. కేవలం 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఢిల్లీ జట్టు ఆలౌట్ అయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 76 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది.  

భువీ, హేజిల్‌వుడ్ కిరాక్ బౌలింగ్: 
మ్యాచ్ ఆరంభం నుంచే ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన ట్రేడ్‌మార్క్ స్వింగ్‌తో ఓపెనర్ సాహిల్ పరాఖ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. అనంతరం జోష్ హేజిల్‌వుడ్ తన కోటాను దిగ్విజయంగా ఆరంభించాడు. హేజిల్‌వుడ్ వేసిన తొలి బంతికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, మరుసటి బంతికే సమీర్ రిజ్వీని ‘గోల్డెన్ డకౌట్’ చేసి ఢిల్లీకి షాకిచ్చాడు.

క్రీజులో నిలవలేని ఢిల్లీ బ్యాటర్లు: 
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్ (5) వచ్చి రాగానే ఒక ఫోర్ కొట్టి మంచి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అలాగే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం భువీ వేసిన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయి తీవ్ర నిరాశపరిచాడు. ఇక నితీష్ రాణా (1) కూడా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. కానీ డేవిడ్ మిల్లర్ (19) మాత్రం కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా, రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో కీపర్ జితేశ్ శర్మకి క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు.

పోరెల్ ఒంటరి పోరాటం: 
ఒకవైపు వికెట్లు పడుతున్నా, యంగ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఒక్కడే పట్టుదలగా నిలబడ్డాడు. జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. చివర్లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయినప్పటికీ, ఢిల్లీని అత్యంత తక్కువ స్కోరు నుంచి కొంత మేర గట్టెక్కించాడు. కైల్ జేమీసన్ (12) కాసేపు సహకరించినా కృనాల్ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా ఆర్‌సీబీ బౌలర్లు సమష్టిగా రాణించి ఢిల్లీ వెన్నుముక విరిచారు. ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లతో చెలరేగగా,  భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, రాసిఖ్ సలామ్ దార్ తలో వికెట్ సాధించారు.
 

©️ VIL Media Pvt Ltd.