Reading Time: < 1 minute

కాబోయే భార్యకు చెప్పి వెళ్లాడు.. ట్రేకింగ్‌కు వెళ్లిన టెకీ మిస్సింగ్.. ఆచూకీ కోసం డ్రోన్లతో గాలింపు!

Caption of Image.

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని శివగంగ కొండకు శుక్రవారం ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అదృశ్యమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అద్వైత్ ఉపాధ్యాయ్ (31) బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ఇతనికి జనవరిలోనే పెళ్లి ఫిక్స్ అయింది. శుక్రవారం ఉదయం తన కాబోయే భార్యకు చెప్పి, బెంగళూరు దగ్గరలోని ఫెమస్  ట్రెక్కింగ్ ప్రదేశమైన శివగంగ కొండకు ఒంటరిగా  బైక్‌పై వెళ్లాడు. కొండ కింద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఉదయం 7:30 గంటలకు అతను ట్రెక్కింగ్ ప్రారంభించినట్లు  తేలింది.

సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి వస్తానని చెప్పిన అద్వైత్.. ఆ తర్వాత ఫోన్ చేయలేదు. సాయంత్రానికి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కాబోయే భార్య ఆందోళన చెంది రాత్రి 7:30 గంటలకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కొండ కింద అతని బైక్‌ను గుర్తించారు. కానీ, అతని మొబైల్ సిగ్నల్స్ మాత్రం సాధారణ ట్రెక్కింగ్ దారిలో కాకుండా వేరే ప్రాంతంలో చూపించాయి.

అద్వైత్ ఆచూకీ కోసం పోలీసులు, కర్ణాటక రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (KSDRF) సిబ్బంది రంగంలోకి దిగారు. కొండపై ప్రమాదకరంగా ఉండే ‘శాంతల డ్రాప్’ అనే నిటారైన అంచు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాలిబాటన వెళ్లడానికి వీలులేని కొండ ప్రాంతాలు, లోయలను వెతకడానికి హై-రిజల్యూషన్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు.

బెంగళూరుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగ , ట్రెక్కింగ్,  హైకింగ్ చేసేవారికి ఒక ఫెమస్ వీకెండ్ డెస్టినేషన్. 4,488 అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండకి.. చిన్న మెట్లు, మార్గాలతో ఉంటుంది. 

అయితే ఇలాంటి ఘటనే ఒకటి ఈ ఏడాది ఏప్రిల్‌లో కొడగు జిల్లాలోని తడియాండమోల్ కొండల్లో జరిగింది. కేరళకు చెందిన శరణ్య అనే టెకీ ఒంటరిగా ట్రేకింగ్‌కు వెళ్లి అడవిలో చిక్కుకుపోగా, మూడ్రోజుల తర్వాత క్షేమంగా బయటపడ్డారు. 
 

©️ VIL Media Pvt Ltd.