
మనతెలంగాణ/హైదరాబాద్ : నేతల గృహ నిర్బంధం, అరెస్టులు, నిరసనలతో బిఆర్‌ఎస్ నేతల పరిగి పర్యటన ఉద్రిక్తంగా మారింది. పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్‌రావును, బిఆర్‌ఎస్ నేతలను మంగళవారం పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడంతోపాటు అరెస్టులు చేశారు. ఉదయం హరీష్ రావు సహా పలువురు బిఆర్‌ఎస్ నాయకులను గృహనిర్భందం చేసిన పోలీసులు హరీష్ రావు బయటకి రాకుండా ఆయన నివాసం వద్ద భారీగా మొహరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరిగి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన హరీష్‌రావును అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నార్సింగి పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు బిఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ బిఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవటంపై బిఆర్‌ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అదనపు బలగాలను తరలించారు. మధ్యాహ్నం హరీష్‌రావుతో పాటు అరెస్టు చేసిన బిఆర్‌ఎస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం దౌర్జన్యం అంటూ ధ్వజమెత్తారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బందాల పాలన అని పేర్కొన్నారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని అన్నారు. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు అని తేల్చిచెప్పారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే తమ గొంతు నొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ ఆలోచలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి
పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని హరీష్‌రావు ఆరోపించారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమేనా ప్రజాపాలన..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయిలా అయిపోయిందని ఘాటు విమర్శలు చేశారు. దళిత, గిరిజన బలహీన వర్గాల భూముల మీద రేవంత్‌రెడ్డి దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సొంత జిల్లాలోనే భూములకు రక్షణగా ఉండాల్సింది పోయి భక్షకులవుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండున్నరేండ్లలో 10వేల ఎకరాల దళితుల, ఎస్‌టిల భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఎస్‌సి, ఎస్‌టిల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతది అన్నట్లు, రేవంత్ రెడ్డి ఆలోచనలు అన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయని విమర్శించారు. లగచర్ల, హెచ్‌సియు, హిల్ట్ పి, నాదర్‌గుల్ భూములు, తాజాగా పరిగిలో భూములు అని పేర్కొన్నారు.