Reading Time: < 1 minute

 ఆర్టెమిస్ 2 మిషన్‌లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రుని అవతలి వైపు నుంచి వ్యోమగాములు తీసిన భూమి ఫోటోను నాసా విడుదల చేసింది. తిరుగు ప్రయాణంలో మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మాన్ ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫోటో ఇది ” అని పేర్కొంది. ఈ యాత్రలో భాగస్వాములైన ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడా వాసి, చందమామపై కాలు పెట్టకుండా సుదూరం నుంచే జాబిల్లిని చుట్టి వస్తుండడం విశేషం. ఈ వ్యోమగాములు సూర్యగ్రహణాన్ని వీక్షించారు.

చంద్రుడికి అతి సమీపం నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అలాగే చంద్రుడి భ్రమణ సమయంలో అనూహ్యమైన సూర్యాస్తమయాన్ని వీక్షించారు. అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలను ఫోటో తీశారు. భూమి, మెర్యూరీ, వీనస్,మార్స్, శని గ్రహాల ఫోటో తీశారు. అనేక శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు చంద్రుడి ఉపరితలాన్ని వ్యోమగాములు పరిశీలించ గలిగారు. కొత్తగా రెండు అగాధాలను గుర్తించారు. వాటికి గతంలో వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఇంటిగ్రిటీ పేరును ఒకదానికి, కారల్ అని మరో దానికి పేరు పెట్టారు. కమాండర్ రీడ్‌వైజ్‌మాన్ భార్య కారల్ ఇటీవల క్యాన్సర్‌తో మృతి చెందింది. అందుకే ఆమె పేరు పెట్టారు. వీరు 10న భూమిపై ల్యాండ్ అవుతారు.