
ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుందో లేదో కానీ బడి మాత్రం ఉంటుంది. బడి ప్రాధాన్యత అలాంటిది. ఒకవేళ ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేటు పాఠశాల కానీ లేకపోయినా కనీసం ఆ ఊర్లో ఎవరో చదువుకున్న వ్యక్తి అయినా నలుగురిని కూర్చోబెట్టుకుని ఏదో నేర్పుతుంటాడు. చదువుకు అనాది నుండి అదే ప్రాముఖ్యత. ఎవరైనా తాము చదివిన బడిని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను అంత తొందరగా మరువలేరు. బడి పట్ల అభిమానం, గురువుల పట్ల గౌరవం ఏనాడు తరగవు. బడితో ఉండే అనుబంధం చిరకాలం నిలుస్తుంది. చిన్ననాటి బడి గురువులు కనపడగానే సహజంగానే మనసు గతం లోతుల్లోకి వెళ్లిపోతుంది. మన తెలంగాణ విద్యా కమిషన్ ఊళ్ళలోని పాఠశాలలను విలీనం చేసి ప్రతి మండలంలో విద్యార్థుల సంఖ్యను బట్టి మూడు లేదా నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయమని సిఫార్సు చేయగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించి నిధులు కేటాయించి రంగంలోనికి దిగుతున్నది. మనం చిన్నతనంలో చదువుకున్న ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, సెకండరీ పాఠశాలలన్నీ కలిసిపోయి ఒకే పాఠశాలగా ఇంటర్మీడియట్‌వరకు నడుస్తాయట.
వివిధ యాజమాన్యాలతో నేడు నడుస్తున్న 28 రకాల పాఠశాలలన్నీ మాయమై మూడు లేదా నాలుగు రకాలు మాత్రమే మనకు కనబడతాయి. అంతేకాదు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా క్రమంగా తగ్గిపోయి కాలక్రమంలో కాంట్రాక్టు టీచర్లే ఈ పబ్లిక్ స్కూల్స్‌లో పాఠాలు చెప్తారు. జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియట్ బోర్డు కూడా రద్దు కాబోతున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి వార్షిక పరీక్షలు కూడా ఉండవు. ఈ పెను మార్పులన్నీ విద్యా విధానాన్ని ఏం చేస్తాయో కానీ మొత్తం మీద ఒక గందరగోళ పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొని ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్ బిఎస్‌సి, ఫార్మసీ లాంటి కోర్సులు చదవడానికి కూడా ప్రవేశ పరీక్షలు ఉండవు. కేవలం ఇంటర్‌లో మార్కుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక భవిష్యత్తులో గురుకులాల సంఖ్య పెరగబోదు. అవి అలాగే కొనసాగితే సంతోషించాల్సిన పరిస్థితి.
తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరి మురళి అనే ఒక ఐఎఎస్ అధికారి నేతృత్వంలోని టీం రాష్ట్రంలోని 35 పాఠశాలలు తిరిగి తల్లిదండ్రులతో, విద్యార్థులతో సమావేశాలు జరిపి 54 సెమినార్లు నిర్వహించి ఐదు రాష్ట్రాలు, మూడు విదేశాలు పర్యటించి దాదాపు 18 నెలల కాలంలో ఇచ్చిన నివేదికలో 434 సిఫార్సులు చేసి విద్యావేత్తలను, ఉపాధ్యాయ సంఘాలను, ముఖ్యంగా విద్యాభిమానులను ఆశ్చర్యములోనేకాక ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు మంగళం పాడుతామని ప్రభుత్వం పదేపదే చెప్పడమే కానీ గత రెండున్నర ఏళ్లలో అందుకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు లక్షల్లో తగ్గుతుండగా, ప్రైవేటు రంగంలోని బడులలో అవి అదే సంఖ్యలో పెరగడం గమనార్హం. గత పదిహేళ్లుగా ఎన్నో విజయాలు సాధించి ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తూ పివి నరసింహారావు ఆలోచనలకు, ఎన్‌టి రామారావు ఆశయాలకు అనుగుణంగా నడిచి ఐఐటి, మెడిసిన్ సీట్లు గణనీయంగా సాధిస్తూ ఇటు క్రీడారంగంలో కూడా దేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన గురుకులాలకు నేడు ఆదరణ కరువై కునారిల్లుతున్నాయి.
ఆకునూరి కమిటీ నివేదిక విద్యారంగంలో కలకలాన్ని సృష్టించింది. ప్రభుత్వ రంగంలో నేటి వరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలు లేవు. పల్లెల్లో అంగన్వాడీలు ఉన్నాయి. అన్ని పాఠశాలలనూ విలీనం చేస్తే పూర్వ ప్రాథమిక నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించడం అనేక వయసుల వారు అంటే మూడేళ్ల నుండి 17 ఏళ్ల వరకు విద్యార్థులు ఒకే చోట విద్యాభ్యాసం చేయడం సబబేనా? ఆరోగ్యకర వాతావరణం సాధ్యమేనా? కేవలం భవనాలతో రంగులతో, హంగులతో నాణ్యమైన విద్య ఇవ్వగలరా? కార్పొరేట్ వ్యవస్థలో ఇరుకు గదులలో గాలి వెలుతురు లేకుండా క్రీడా మైదానం ఇతర కృత్యాలు లేకుండా ఫలితాలు రావడం లేదా? వాటిని మనం సమర్థించడం లేదు. కానీ నాణ్యత కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు కంటే ఒక 1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాగు చేయవచ్చు. బలోపేతం చేయడం అంటే విలీనం చేసి ఒకేచోట విద్యాభ్యాసం ఏర్పాటు చేయడమేనా? గురువులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని, వారికి పదోన్నతులు వద్దని చెప్పడం ఒకరకంగా గురువులకు పంగనామాలు పెట్టడమే. సమాజానికి మార్గదర్శి అయిన గురువు ప్రాధాన్యతను తగ్గించి అవమానించడమే.
కాంట్రాక్టు టీచర్లు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నా తక్కువ జీతానికి అభద్రతాభావంతో వారు పనిచేయడం కూడా అనుమానాస్పదమే. జాతీయస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దుచేసి పాఠశాల విద్యలో విలీనం చేయవలసిన అవసరం లేదు కదా! అంటే నూతన విద్యా విధానాన్ని మన ప్రభుత్వం అనుసరించబోతున్నదా? చిన్ననాటి నుండి ఆంగ్ల మాధ్యమం కూడా అర్థంలేని సిఫారసు. భావ నిర్మాణం మాతృభాషలోనే సాధ్యమని అనేక కమిటీలు విధానాలు ఘోషిస్తున్నాయి. పాఠశాలలో తప్ప మిగిలిన జీవితంలో మనం మాట్లాడేది మాతృభాష మాత్రమే. అంతేకాదు గిరిజన భాషలకు కూడా ముప్పు ఏర్పడవచ్చు. ఆంగ్ల మాధ్యమాన్ని 5 నుండి లేదా 8వ తరగతి నుండి ఐచ్ఛికం చేయవచ్చు. అసలు ఆంగ్ల మాధ్యమంలో బోధించే నైపుణ్యం గల ఉపాధ్యాయులు చాలినంత మంది ఉన్నారా? శిక్షణ ఇచ్చినంత మాత్రాన రోజుల్లోనే నైపుణ్యం వస్తుందా? ప్రతిరోజు విద్యార్థులు ప్రయాణం చేయడం రిస్క్‌తో కూడిన పని. 24 గంటలు క్యాంపస్‌లో ఉంటేనే ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి.
రెండు వేల పాఠశాలల నిర్మాణం ఎన్ని సంవత్సరాలకు జరిగేను? ఒకవేళ ప్రభుత్వాలు మారితే ఈ విధానం ఈ బడులు నిలిచేనా? రూ. 20 వేల కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరికోసం? ఈ విలీనం విద్యా వికాసానికా లేక విధ్వంసానికా అనేది విద్యావేత్తలు ముఖ్యంగా ఉపాధ్యాయుల సందేహం. గిరిజన బిడ్డల భవితవ్యం ఏమిటి? ఏం కాబోతున్నది? గ్రామీణ నిరుపేదలు చదువుకు మరింత దూరం అవుతారా అనే ఆందోళన ప్రజల్లో ఉంది. విద్యకు 18 శాతం బడ్జెట్ కేటాయింపు చేయాలన్న సిఫార్సు అందరికీ ఆమోదయోగ్యమే కానీ ప్రభుత్వానికి అది ఆచరణ సాధ్యం కాదు. అందుకే 2026- 27 బడ్జెట్లో 8.2% కేటాయించి తన ఉద్దేశాన్ని చాటిచెప్పింది.కమిషన్ ఆలోచనలు ఆకాశంలో ఉండగా ప్రభుత్వ చేతలు పాతాళంలో ఉన్నాయి.
విద్యార్థుల ఆశలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు ఉపాధ్యాయుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల కంటే బోధనేతర సిబ్బందికే ఎక్కువ జీతాలు సిఫార్సు చేయడం ద్వారా ఈ కమిషన్ ఉపాధ్యాయుల శ్రమ దోపిడీకి ఎర్రతివాచీ పరిచినట్లుగానే భావించాలి. మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన వేతనాలు ఉండాలి. అనేక దేశాల్లో ఉపాధ్యాయుల వేతనాలు అత్యధికంగా ఉన్నాయి. కానీ కమిషన్ వాటిని పరిశీలనలోనికి తీసుకోలేదు. తన పరిధి దాటి కమిషన్ వేతనాల గురించి వ్యాఖ్యానించడం అభ్యంతరకరం. ఉపాధ్యాయ శిక్షణలను మరింత పక్కాగా నడిపించాలి అనేది ఒప్పుకోదగిన అంశం. ఇంటర్ తర్వాత వృత్తి విద్యా కోర్సులకు ప్రవేశ పరీక్ష వద్దు అని చెప్పడం ప్రైవేటు రంగానికి మార్గం మరింత సుగమం చేస్తున్నది. ఇంతకాలంగా వృత్తి విద్యా కోర్సులు చదవడానికి పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని తీసివేయాలని చెప్పడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు దూరం చేయడమే.
డిగ్రీ గురుకులాలను రద్దు చేయాలనడం సంక్షేమ విద్యార్థుల ఉన్నత విద్య ఆశయాలకు అడ్డుకట్ట వేయడమే. ప్రజలకు, వారి నివాసాలకు విద్యాలయాలు అందుబాటులో ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని కమిషన్ ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతున్నది. అంటే కమిషన్ సభ్యులు యుజిసి నిబంధనలు అధిగమించి ప్రామాణికంగా ఉన్న కొఠారి కమిషన్ సూత్రాలను పక్కనపెట్టి విద్యా హక్కు చట్టాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నివేదిక తయారు చేశారా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. 350 పేజీల నివేదిక ఇన్ని ప్రశ్నలకు అనుమానాలకు తావు ఇచ్చే రీతిలో తయారు చేశారు. దీనివల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి. ఆలోచనల స్థాయిలోనే ఇన్ని సమస్యలు ఉండగా, అమలులో ఇంకెన్ని సమస్యలు రాబోతున్నాయో? ఉపాధ్యాయ సంఘాలను వారి సలహాలను పరిగణనలోనికి తీసుకోకుండా ఈ నివేదిక తయారైందని సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా అనేక అనుమానాలకు ఆలవాలమైన ఈ నివేదిక ఉపాధ్యాయులను సంతృప్తి పరచగలదా? తల్లిదండ్రుల ఆకాంక్షలకు, విద్యార్థుల ఆశలకు రూపు ఇవ్వగలదా? కాలమే సమాధానం చెప్పాలి.
– శ్రీ శ్రీ కుమార్