Reading Time: < 1 minute
IPL 2026: హ్యాట్రిక్ ఓటములున్నా.. చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?

Chennai Super Kings: ప్రస్తుత సీజన్‌లో చెన్నై ప్రధాన సమస్య బౌలింగ్. ముఖ్యంగా పవర్ ప్లే, చివరి ఓవర్లలో ప్రత్యర్థి జట్టును అడ్డుకోవడంలో బౌలర్లు విఫలమవుతున్నారు. తక్కువ పరుగులు ఇచ్చి వికెట్లు తీయగల బౌలర్ అవసరం జట్టుకు ఉంది. వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హోసేన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. అకీల్ పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా, వికెట్లు తీయడంలోనూ దిట్ట. ఇతని అనుభవం జట్టుకు ఎంతో కీలకం కానుంది.

మిడిలార్డర్ లో మార్పులు..

చెన్నై జట్టు మిడిలార్డర్ బ్యాటింగ్ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది. కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యువ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ క్రమంలో విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను జట్టులోకి తీసుకురావడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఢిల్లీతో జరగబోయే తదుపరి మ్యాచ్ నాటికి బ్రెవిస్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉండటంతో, అతను జట్టులోకి వస్తే బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుంది.

ధోనీ మార్గదర్శనం, వ్యూహాలు..

మైదానంలో ఎంఎస్ ధోనీ ఉంటే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సూచనలు ఇవ్వడంలో, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీకి సాటి ఎవరూ లేరు. గత మూడు మ్యాచ్‌ల్లో ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతని రాక జట్టులో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. దీంతో పాటు యువ ఫాస్ట్ బౌలర్ రామకృష్ణ ఘోష్‌కు అవకాశం ఇస్తే డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించే వీలుంటుంది.

రాయుడు ఆశాభావం..

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా చెన్నై పునరాగమనంపై ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా చెన్నై ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. జట్టులో సానుకూల మార్పులు జరిగితే ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమేమీ కాదని రాయుడు అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్, కీలక ఆటగాళ్ల పునరాగమనం జట్టు తలరాతను మారుస్తుందని ఆయన పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..