
మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో దేశ భక్తులకు-దేశ ద్రోహులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బెంగాల్‌లోని తమ బంధు, మిత్రులకు ఫోన్లు చేసి బిజెపికి ఓట్లు వేయించాలని హైదరాబాద్‌లోని బెంగాళీలకు ఆయన పిలుపునిచ్చారు. పాత నగరంలోని హైకోర్టు సమీపంలో గల మురళీధర్ ఆలయాన్ని సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో దాదాపు 60 వేల మంది బెంగాలీలు నివసిస్తున్నారని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న వాళ్ల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి బిజెపికి ఓట్లు ఓటేయించాలని కోరుతున్నానని అన్నారు. బిజెపికి ఓట్లు వేయిస్తామని హైదరాబాద్‌లోని బెంగాలీ సమాజమంతా తనకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘా తం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రెడ్ కార్పేట్ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. బెంగాల్‌లో ఉండలేక అనేక బెంగాలీ కుటుంబీకులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారని ఆయన తెలిపారు. పాతబస్తీలోనూ బెంగాలీ కుటుంబాలు ఉండలేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగాలీ పిల్లలకు మజ్లీస్ డ్రగ్స్ ఎర
పాతబస్తీలో కొంత మంది బెంగాలీ కుటుంబాల పిల్లలను మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎరవేసి లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మజ్లిస్ గూండాల అరాచకాలకు పోలీసులూ వత్తాసు పలకడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లిన జిహెచ్‌ఎంసి అధికారులు, పోలీసులపై మజ్లిస్ ఎమ్మెల్సీ, నాయకులు అడ్డుకుని దౌర్జన్యం చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు.