
హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. బుద్వేల్‌లోని టీచర్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై టౌన్ ప్లానింగ్ విభాగం ఉక్కుపాదం మోపింది.
అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో… అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను గుర్తించి, జేసీబీలతో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులకు గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ… వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి. నగరంలో అక్రమ నిర్మాణాలపై ఎలాంటి సడలింపులు ఉండవని, భవన నిర్మాణాలకు ముందు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అనధికార నిర్మాణాలను అరికట్టేందుకు మున్ముందు కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.