Reading Time: < 1 minute
భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వే స్టేషన్.. ఎక్కడంటే?

మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సగటున ప్రతిరోజు 25వేల మంది భక్తులు, యాత్రికలు సందర్శిస్తున్నారు. అయితే లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల సౌకర్యార్థం ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు MMTS సర్వీస్‌లను పొడిగించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. యాదగిరిగుట్ట పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయిగిరి రైల్వే స్టేషన్‌ పేరును ఇప్పటికే యాదాద్రిగా పేరు మార్చింది రైల్వేశాఖ. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం రూ.24.50 కోట్లు కేటాయించింది.

ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్‌గా..

ఇందులో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా ఆధునికరించడంతోపాటు. ఆధ్యాత్మిక హంగులను అద్దుతున్నారు. ఈ రైల్వే స్టేషన్‌ ప్రధాన ముఖ ద్వారాన్ని ఆలయ రాజ గోపురం నమూనాలో రూపొందించారు. రైల్వే స్టేషన్‌ ముందు భాగం కూడా ఆలయ ప్రాకరాన్ని తలపించే విధంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. రైల్వేస్టేషన్‌ను సైతం ప్రాకార గోపురాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు.

అంతేకాకుండా ఈ స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా ఆధునికీకరణలో భాగంగా రైల్వే ఫ్లాట్ ఫామ్‌లను రీ సర్ఫేసింగ్‌ చేయనున్నారు. రైలు కోసం వేచి ఉండే ప్రయాణికుల కోసం ఎయిర్‌ కండీషన్‌తో కూడిన విశ్రాంతి హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ప్లాట్‌ ఫారం ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా సాంకేతికంగా చేసిన డిజైన్‌లతో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లను తీర్చిదిద్దుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌- కాజీపేట- విజయవాడ మార్గంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం కృష్ణా, కాకతీయ, పుష్‌పుల్‌ వంటి మూడు, నాలుగు రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. యాదాద్రి రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ తర్వాత ఈ మార్గంలో సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ఆగడానికి అవకాశాలున్నాయి. రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆధునికీకరణ పనులను ఏడాదిన్నరలో పూర్తిచేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.