Reading Time: 2 minutes

ప్రైవేట్ హాస్పిటల్ బతుకు బయటపెట్టిన లేడీ డాక్టర్ వీడియో !

Caption of Image.

డాక్టర్గా ఒక ప్రముఖ హాస్పిటల్లో ఉద్యోగంలో చేరిన కొన్ని గంటల్లోనే జాబ్కు రిజైన్ ఇచ్చేసిన ఒక యువ వైద్యురాలి వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో సదరు హాస్పిటల్ దోపిడీ గురించి ఆ యువ వైద్యురాలు బయటపెట్టిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ హాస్పిటల్ ఓనర్ ఒక సీనియర్ గైనకాలజిస్ట్ అని.. వాస్తవానికి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేని పేషెంట్లను కూడా చేర్చుకోవాలని సిబ్బందికి చెప్పడం తనను షాక్కు గురిచేసిందని ఆమె చెప్పారు. అవసరం లేకపోయినా ఐసీయూలో ఉంచి బిల్లులు పెంచి ఆదాయం పెంచాలని హాస్పిటల్ సిబ్బందికి టార్గెట్ పెట్టడం చూసి అవాక్కయ్యానని ఈ యువ డాక్టర్ తెలిపారు. రోగులను దోచుకునే వ్యవస్థలో తాను భాగం కావడం ఇష్టం లేకనే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆమె చెప్పారు.

తనకు మంచి జీతం ఆఫర్ చేశారని.. కానీ ఇలా పేషంట్లను దోచుకోవడం నచ్చకనే ఉద్యోగం వదులుకున్నానని ఆమె వివరించారు. ఉదయం ఆ హాస్పిటల్లో పనిచేసి.. సాయంత్రం తను క్లినిక్ నడుపుకోవచ్చని భావించానని.. మరేం పర్లేదని ఇప్పుడు కూడా క్లినిక్ నడుపుకుంటూనే రోగులకు వైద్యం అందిస్తానని ఆమె చెప్పారు. ఈ యువ వైద్యురాలు ఉద్యోగానికి రాజీనామా చేయడంపై నెటిజన్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నెటిజన్లు ఏకపక్షంగా ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఈరోజుల్లో చిన్న విషయం కాదని పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు.

కొందరు నెటిజన్లు మాత్రం మన దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ఇలా కొత్తేం కాదని.. అవసరం లేకపోయినా స్కానింగ్లు, టెస్టులు రాయడం.. ఐసీయూలో ఉంచి అందిన కాడికి దోచుకోవడం మన దేశంలోని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకొచ్చారు. ఈ దోపిడీకి జనాలు కూడా అలవాటు పడటంతో ప్రైవేట్ హాస్పిటల్స్ దందా మూడు పువ్వులూ ఆరు కాయలుగా నడుస్తుందని కొందరు నెటిజన్లు నిట్టూర్చారు.

హాస్పిటళ్లు సొంతంగా సొంత మెడికల్​షాపులు రన్​చేస్తూ దోచుకుంటున్నా, పట్టించుకోవడం పేషెంట్లు మండిపడుతున్నారు. ప్రిస్క్రిప్షన్​ క్లియర్​గా రాయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని హాస్పిటళ్లు పీఆర్ఓలను నియమించుకుని మరీ దందా చేస్తున్నాయి. 40 శాతం వరకు కమీషన్ ఇస్తున్నాయి. ఆర్ఎంపీ, పీఎంపీలు, అంబులెన్స్​డ్రైవర్లను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ఇలా తమ దోపిడీలో హాస్పిటల్ కింది స్థాయి ఉద్యోగులను, సిబ్బందిని కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ భాగం చేస్తుండటం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.