Reading Time: 2 minutes
ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర సగానికి సగం తగ్గుతుంది.. మస్త్ పైసల్ ఆదా..

ప్రతిరోజూ పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. లీటరు సెంచరీ దాటి దూసుకుపోతుంటే.. అసలు ఈ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? పెట్రోల్ బేస్ ధర కేవలం రూ. 55 ఉంటే, మన దగ్గరకు వచ్చేసరికి రూ. 100 ఎందుకు అవుతోంది? ఒకవేళ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే నిజంగానే ధరలు తగ్గుతాయా? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. నిజానికి మనం పోయించుకునే పెట్రోల్ ధరలో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ వంటి నగరంలో పెట్రోల్ బేస్ ధర లీటరుకు సుమారు రూ.55 మాత్రమే. కానీ దీనికి కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను, డీలర్ కమీషన్ వంటివి కలిపిన తర్వాత మనకు లీటరు ధర రూ.100 దాటుతోంది. అంటే అసలు ధర కంటే పన్నుల రూపంలోనే మనం ఎక్కువ చెల్లిస్తున్నాం.

ఒకవేళ 12శాతం జీఎస్టీ విధిస్తే?

పెట్రోల్‌పై ప్రస్తుతమున్న రకరకాల పన్నులను తీసివేసి, కేవలం 12శాతం జీఎస్టీ మాత్రమే అమలు చేస్తే సీన్ మొత్తం మారిపోతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.68 – రూ.70కి తగ్గుతుంది. అంటే ఇప్పుడున్న ధర కంటే దాదాపు రూ.30 వరకు ఆదా అవుతుంది. డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.67 – రూ.68కి చేరుతుంది. ఇది సామాన్య రవాణా రంగానికి పెద్ద ఊరట.

ఒకవేళ 28శాతం

ఒకవేళ ప్రభుత్వం అత్యధిక స్లాబ్ అయిన 28శాతం జీఎస్టీని అమలు చేసినా సరే.. మనకు లాభమే ఉంటుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.75 – రూ.80 మధ్య ఉంటుంది. ఇది కూడా ప్రస్తుత ధరల కంటే చాలా తక్కువే. ఇక డీజిల్ ధర సుమారు రూ.72 – రూ.75 వద్ద ఉంటుంది.

జీఎస్టీ వల్ల ధరలు ఎందుకు తగ్గుతాయి?

ప్రస్తుత విధానంలో పన్ను మీద పన్ను పడుతోంది. అంటే కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకంతో కలిపి ఉన్న మొత్తంపై రాష్ట్రాలు మళ్లీ వ్యాట్ వేస్తున్నాయి. కానీ జీఎస్టీ అనేది సింగిల్ టాక్స్ విధానం. దీనివల్ల పన్ను భారం తగ్గి, సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంది.

మరి ఎందుకు జీఎస్టీలో చేర్చడం లేదు?

ప్రయోజనాలు ఇంత స్పష్టంగా ఉన్నా, ఇంధనాన్ని జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆదాయం. పెట్రోల్, డీజిల్‌పై వచ్చే వ్యాట్ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు. దీన్ని జీఎస్టీలో కలిపేస్తే తమకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని, కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందని రాష్ట్రాలు భయపడుతున్నాయి.