
భారతదేశంలో మహిళలు నివసించడానికి, ఉద్యోగాలు చేయడానికి ఏ నగరాలు అత్యంత సురక్షితం అనే విషయంలో అవతార్ సంస్థ విడుదల చేసిన ‘టాప్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా (TCWI) 2025’ రిపోర్ట్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇందులో మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలు, భద్రత, జీవనం కల్పించడంలో బెంగళూరు దేశంలోనే నంబర్ వన్ నగరంగా నిలిచింది. అయితే బెంగళూరు 53.3 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో చెన్నై (49.9), పుణె (46.3), హైదరాబాద్ (46.0), ముంబై (44.5) నిలిచాయి.
మన భాగ్యనగరం (హైదరాబాద్) నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. సామాజిక భద్రత, పారిశ్రామిక అవకాశాల మధ్య హైదరాబాద్ మంచి బ్యాలెన్స్ పాటిస్తోంది. అంటే ఇక్కడ ఉద్యోగాలే కాకుండా, మహిళలు ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన వాతావరణం కూడా బాగుందని రిపోర్ట్ చెబుతోంది.
అంతేకాదు మహిళల భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ విషయంలో దక్షిణ భారత నగరాలే దేశంలోనే ముందున్నాయి. గత ఏడాది 9వ స్థానంలో ఉన్న గురుగ్రామ్, ఈసారి 6వ స్థానానికి చేరుకుంది. ఇక్కడ కంపెనీలు మహిళా ఉద్యోగులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ముంబైలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్న, అక్కడ పెరిగిన జీవన వ్యయం, మౌలిక సదుపాయాల కొరత వల్ల సామాజిక స్కోరు తగ్గింది. కేవలం మెట్రో నగరాలే కాకుండా, టైర్-2 నగరాలైన కోయంబత్తూరు, తిరువనంతపురం వంటివి కూడా మహిళలకు అనుకూలమైన నగరాల జాబితాలో చేరుతున్నాయి.
TCWI ర్యాంకింగ్స్ లిస్ట్:
1. బెంగళూరు (53.3)
2. చెన్నై (49.9)
3. పూణే (46.3)
4. హైదరాబాద్ (46.0)
5. ముంబై (44.5)
6. గురుగ్రామ్ (35.6)
7. కోల్‌కతా (34.2)
8. అహ్మదాబాద్ (33.8)
9. తిరువనంతపురం
10. కోయంబత్తూరు
ఈ రిపోర్ట్ ప్రకారం.. నగరాల్లో కేవలం ఆఫీసులు పెరగడమే కాకుండా, మహిళల భద్రత, రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే అవి నిజమైన ‘వుమెన్ ఫ్రెండ్లీ సిటీ’గా మారుతాయి. దక్షిణ భారతదేశం ఈ విషయంలో మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.