Reading Time: < 1 minute

బోణీ కొట్టిన వాన.. కేకేఆర్‌‌‌‌‌‌-పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్ వర్షార్పణం..

Caption of Image.

 

కోల్‌‌కతా:  ఐపీఎల్‌‌ 19వ సీజన్‌‌లో వరుణుడు ఖాతా తెరిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్‌‌కతా నైట్ రైడర్స్  మ్యాచ్‌‌ భారీ వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే వాన మొదలైంది. ఆట నిలిచిపోయే సమయానికి కోల్‌‌కతా 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 రన్స్‌‌ చేసింది. గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేసినా దాదాపు రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానతో మ్యాచ్ కొనసాగడం కష్టంగా మారింది. పదిన్నర గంటలకు వాన పూర్తిగా ఆగడంతో కనీసం  ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు గ్రౌండ్‌‌ను చెక్‌‌ చేశారు.  అయితే బౌండరీ లైన్స్ వద్ద భారీగా  వాన నీళ్లు నిలిచిపోవడంతో 11 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. గత రెండు మ్యాచ్‌‌ల్లో నెగ్గిన పంజాబ్..  ప్రస్తుతం మూడు పాయింట్లతో ఆర్సీబీని వెనక్కునెట్టి టాప్ ప్లేస్‌‌లోకి వచ్చింది. 

తొలి రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిన కేకేఆర్‌‌‌‌కు ఏకైక పాయింట్ లభించింది.  అంతకుముందు బ్యాటింగ్‌‌కు దిగిన కోల్‌‌కతాకు పంజాబ్ బౌలర్‌‌‌‌, ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్‌‌లెట్ చుక్కలు చూపించాడు.  రెండో ఓవర్‌‌‌‌లో బౌలింగ్‌‌కు దిగిన అతను మూడు బాల్స్‌‌లో  వ్యవధిలోనే  ఓపెనర్ ఫిన్ అలెన్ (6)తో పాటు కెమెరాన్ గ్రీన్ (4)ను ఔట్ చేయడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది.  వేలంలో రూ. 25.20 కోట్ల భారీ ధర పలికిన ఆసీస్‌‌ ఆల్‌‌రౌండర్ గ్రీన్ వరుసగా మూడో మ్యాచ్‌‌లోనూ ఫెయిలవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.  కెప్టెన్ అజింక్యా రహానె (8 నాటౌట్‌‌), యంగ్ బ్యాటర్ అంగ్‌‌క్రిష్ రఘువంశీ (7 నాటౌట్‌‌) ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. కాసేపటికే వర్షం తీవ్రం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాగా, ఈ సీజన్‌‌లో తొలి విజయం కోసం చూస్తున్న కేకేఆర్ ఓనర్ షారూఖ్ ఖాన్ ఈ మ్యాచ్‌‌ చూసేందుకు స్టేడియానికి వచ్చాడు.

©️ VIL Media Pvt Ltd.