
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో షెడ్యూల్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్ల మధ్య మ్యాచ్ అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. కొంతమంది అభిమానులు భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) షెడ్యూల్‌లో అనుమానాలు ఉన్నాయని, ఆర్‌సీబీకి పరోక్షంగా లాభం చేకూర్చిందని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలవగా.. సీఎస్‌కే ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 28న ఆడింది. ఆ తర్వాత 7 రోజుల విరామం లభించింది. ఇది బెంగళూరు జట్టుకు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ విరామం వల్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు గాయాల నుంచి కోలుకోవడానికి కూడా సమయం దొరికింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా జట్టు మొత్తం చిన్నస్వామి మైదానంలో ఉండటంతో ప్రయాణ అలసట కూడా లేకుండా ఫ్రెష్‌గా బరిలోకి దిగింది.
మరోవైపు సీఎస్‌కే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మార్చి 30న తొలి మ్యాచ్ ఆడిన చెన్నై.. ఏప్రిల్ 3న రెండో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పెద్దగా విరామం లేకుండానే బెంగళూరులో ఏప్రిల్ 5న మూడో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అస్సాంలో, చెన్నైలో మ్యాచ్‌లు ఆడిన తర్వాత సీఎస్‌కే ప్లేయర్స్ బెంగళూరుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇది జట్టుపై ప్రభావం చూపిందని చెన్నై అభిమానులు అంటున్నారు.
Also Read: Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!
బీసీసీఐపై సోషల్ మీడియాలో సీఎస్‌కే అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక జట్టుకు పూర్తి విశ్రాంతి, మరొక జట్టుకు వరుస మ్యాచ్‌లు, ప్రయాణాలు… ఇది సమాన అవకాశమేనా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ షెడ్యూల్‌పై పారదర్శకత ఉండాలని, అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. టోర్నమెంట్ నిర్వహణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందిస్తారని, ప్రతి జట్టుకీ ఏదో దశలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఏదైమైనా అభిమానుల మధ్య ఈ చర్చ మరికొన్ని రోజులు కొనసాగడం ఖాయం.