Reading Time: < 1 minute
Bima Sugam Launch June 2026 Zero And Premium Prices Are Likely To Decreased

భారతదేశంలో బీమా (Insurance) కొనుగోలు ప్రక్రియ త్వరలోనే చౌకగా మారబోతోంది. 2026 జూన్ నెల నుండి ‘బీమా సుగమ్’ (Bima Sugam) అనే కొత్త ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి రానుంది. ఈ వేదిక ద్వారా ఎటువంటి ఏజెంట్ కమీషన్లు లేని ‘స్టాండర్డ్ ఇన్సూరెన్స్’ పాలసీలు లభిస్తాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల సామాన్యులకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. పాలసీల ధరలు (ప్రీమియంలు) గణనీయంగా తగ్గుతాయి.

అసలు ఏం మారుతుంది..?

సాధారణంగా మనం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే, అందులో ఏజెంట్లకు ఇచ్చే కమీషన్ కూడా కలిసి ఉంటుంది. కానీ బీమా సుగమ్ వేదికపై ఈ కమీషన్లు ఉండవు. ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 5 నుంచి 7 శాతం వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజు మాత్రమే చెల్లిస్తాయి. మధ్యవర్తులు లేకపోవడం వల్ల ఆ మిగిలిన డబ్బు వినియోగదారులకు లాభంగా మారుతుంది. అంటే తక్కువ ధరకే పాలసీలు దొరుకుతాయి. అంతేకాకుండా, ఈ పాలసీలు చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. క్లిష్టమైన నియమ నిబంధనలు లేకుండా, సాదాసీదాగా ఉండటం వల్ల ప్రజలు సులభంగా పోల్చి చూసుకుని తమకు నచ్చినది ఎంచుకోవచ్చు.

Also Read:Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల

ఎప్పుడు ఏవి అందుబాటులోకి వస్తాయి..?

ఈ కొత్త విధానం ఒకేసారి కాకుండా దశలవారీగా అమలులోకి వస్తుంది. జూన్ 2026లో మొదటగా కొత్త వాహనాల కోసం మోటార్ ఇన్సూరెన్స్ ప్రారంభం కావచ్చు. ఆగస్టు 2026లో పాత వాహనాల ఇన్సూరెన్స్ పునరుద్ధరణ (Renewal) మరియు ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 2026లో.. జీవిత బీమాకు సంబంధించిన ‘టర్మ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌లు మొదలవుతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే.. బీమా సుగమ్ అనేది ఒకే ఒక వేదిక. ఇక్కడ మీరు పాలసీలు కొనవచ్చు, పాతవి రిన్యూవల్ చేసుకోవచ్చు మరియు క్లెయిమ్ (డబ్బులు వెనక్కి తీసుకోవడం) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యవర్తుల గొడవ లేకుండా నేరుగా పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఇది అమల్లోకి వస్తే భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగం పూర్తిస్థాయిలో సామాన్యులకు చేరువవుతుంది.