Reading Time: < 1 minute
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం.. ఇదిగో వీడియో

హైదరాబాద్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం నగరాన్ని కలవరపరిచింది. మాదాపూర్ పరిధిలోని మైండ్ స్పేస్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మినీ ట్రక్, స్కూటీపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూటీ ట్రక్ ముందు భాగంలో ఇరుక్కుపోయింది.. స్థానికులు అరుస్తున్నా పట్టించుకోకుండా డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు దూసుకెళ్లడం మరింత భయానకంగా మారింది. స్కూటీని ట్రక్ దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ వరకు వాహనాన్ని ఆపకుండా నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ దృశ్యాన్ని గమనించిన కొందరు యువకులు వెంటనే స్పందించి, ట్రక్‌కు అడ్డంగా వెళ్లి కష్టపడి వాహనాన్ని ఆపించారు.

అయితే వాహనం ఆగగానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని సహాయకుడు మాత్రం స్థానికుల చేతికి చిక్కాడు. కోపంతో ఆగ్రహించిన ప్రజలు అతడిని చితకబాదారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. భర్త ట్రక్ కిందపడే సమయంలో పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మృతురాలు అయేషా (22), ఆమె భర్త అబ్దుల్ బాసిత్ (26) కేరళకు చెందిన వారు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట, జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మహేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటోంది. బాసిత్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి సినిమా చూసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ట్రక్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఒక కుటుంబంలో విషాదం నెలకొనగా.. నగరంలో రోడ్డు భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.