Reading Time: < 1 minute

బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో 16 ఏండ్లకు తీర్పు.. వ్యక్తికి జీవిత ఖైదు

Caption of Image.

మల్కాజిగిరి, వెలుగు: దశాబ్దన్నర కాలం కింద జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడికి శిక్ష పడింది. జీవిత ఖైదుతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ స్పెషల్ ఫాస్ట్​ ట్రాక్ పోక్సో కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..  కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్​లో 2010లో మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేసి కాకర్ల అనిల్ కుమార్ అనే వ్యక్తి​పరారయ్యాడు.  2012లో నాన్​బెయిలబుల్ వారెంట్ జారీ అయినప్పటికీ నిందితుడు పరారీలో ఉండటంతో కేసు సుదీర్ఘ కాలం ముందుకు కదలలేదు.  అయితే, అధికారులు పట్టు వదలకుండా గాలించి, 2025 నవంబరులో నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఆశాలత జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 16 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిందితుడిని చట్టం ముందు నిలబెట్టి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేకూర్చిన విచారణాధికారి ముత్యం రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస చారి, పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. 

చిన్నారులతో అనుచిత ప్రవర్తన.. వ్యక్తికి ఐదేండ్ల జైలు

బషీర్​బాగ్, వెలుగు: ఐదుగురు చిన్నారులతో అనుచితంగా ప్రవర్తించిన యువకుడికి హాకా భవన్​లోని ప్రత్యేక సెషన్స్ కోర్టు ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. 2020లో బండ్లగూడ పరిధిలో 5 నుంచి 9 ఏండ్ల లోపు వయసున్న ఐదుగురు చిన్నారులకు అబ్దుల్ సల్మాన్ (22) అనే వ్యక్తి మాయమాటలతో గుడిసెలోకి తీసుకెళ్లి, అసభ్యకర వీడియోలు చూపించి లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు కాగా, ఉమెన్ సేఫ్టీ వింగ్, భరోసా కేంద్రం బాధితులకు అండగా నిలిచింది. పక్కా ఆధారాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు సోమవారం తీర్పు వెలువరించారు.

©️ VIL Media Pvt Ltd.