
టెహ్రాన్: యుద్ధంలో ఇరాన్ మరో కీలక నేతను కోల్పోయింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా సోమవారం (ఏప్రిల్ 6) జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్, మేజర్ జనరల్ మజీద్ ఖాదెమీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ధృవీకరించింది. ‘‘సోమవారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో తమ ఇంటెలిజెన్స్ చీఫ్, మేజర్ జనరల్ మజీద్ ఖాదెమీ మరణించారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన ఒక కీలక వ్యక్తి’’ అని ఐఆర్జీసీ వెల్లడించింది.
2026, ఫ్రిబవరి 28న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఎసమాయిల్ ఖతీబ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ మహ్మద్ పాక్‌పూర్, ఇరానియన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దోల్రహీం మౌసవి, సెక్యూరిటీ అధికారి అలీ షంఖానీ, IRGC ప్రతినిధి/సీనియర్ అధికారి జనరల్ అలీ మహమ్మద్ నయినీ, బసిజ్ పారామిలిటరీ ఫోర్స్ కమాండర్ ఘోలమ్రెజా సోలిమానీ, IRGC నావికాదళ కమాండర్, హార్ముజ్ జలసంధి వ్యూహకర్త అలీరేజా టాంగ్‌సిరి, IRGC నావికాదళ ఇంటెలిజెన్స్ చీఫ్ బెహ్నామ్ రెజాయీ వంటి కీలక అధికారులు మరణించారు.
►ALSO READ | చేతులు ముడ్చుకుని కూర్చొం.. దెబ్బకు దెబ్బ తీస్తం: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ రీ కౌంటర్
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం ఇరాన్ హార్మూజ్ జల సంధిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ఏప్రిల్ 6లోపు హార్మూజ్ జల సంధిని తిరిగి ఓపెన్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డెడ్ లైన్ విధించాడు. లేదంటే ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఇరాన్ మాత్రం ట్రంప్ అల్టిమేటంను కనీసం లెక్క కూడా చేయలేదు.