Reading Time: < 1 minute
Trump Final Warning Iran Destruction Deadline Ends Hormuz Crisis

Donald Trump: ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం తీవ్రమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం తలుచుకుంటే ఇరాన్‌ను ఒక్క రాత్రిలో నాశనం చేయగలనదని అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కరాత్రిలో దేశం మొత్తం నాశనమైపోవచ్చు, ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో కూలిపోయిన ఎఫ్ -15 ఫైటర్ జెట్ పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ చారిత్రాత్మకమైందిగా పేర్కొన్నారు. తమ సైనికుల్ని కాపాడేందుకు అవసరమైంది ఏదైనా చేయమని తాను సైన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు.

Read Also: Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై బాంబు దాడికి మంగళవారం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. మరోవైపు కాల్పుల విరమణపై తెర వెనక జరుగుతున్న చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అమెరికా ప్రతిపాదనల్ని తిరస్కరించింది. స్వల్పకాలిక కాల్పుల విరమణకు తాము హార్ముజ్‌ను ఓపెన్ చేయబోమని తెగేసి చెప్పింది. హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణను గుర్తించడం, తమ దేశంపై ఆంక్షలు ఎత్తివేయడం, ఆర్థిక నష్టపరిహారం వంటి 10 షరతులను ఇరాన్ పెట్టింది.

ఇరాన్‌లో ప్రతి వంతెన ధ్వంసం చేసి, ప్రతీ విద్యుత్ ప్లాంట్‌ను పనికి రాకుండా చేయడానికి నాలుగు గంటలు సరిపోతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యుద్ధంలో అమెరికా గెలిచిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ వెంటనే ఒక ఒప్పందాన్ని చేసుకోవాలని హెచ్చరించారు. హార్ముజ్ నుంచి స్వేచ్చాయుత రాకపోకలు కావాలని కోరారు. 2015 అణు ఒప్పందంలో అమెరికా కొనసాగి ఉంటే ఇజ్రాయెల్ నాశనమై ఉండేదని, ఇదే విషయాన్ని తాను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు కూడా చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై ఇరాన్‌కు గడువు పొడగించేది లేదని ట్రంప్ తెగేసి చెప్పారు.